Photo Credit: BCCI Twitter
హరారే వేదికగా ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకొని మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
మరోసారి అదే వేదికలో మ్యాచ్ ఆడుతుండడంతో, రెండో టీ20లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఓపెనింగ్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం తొలి టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మను తప్పించి అతడి స్థానంలో ప్రబ్‌సిమ్రన్‌ను ఆడించే అవకాశముంది.
ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మూడో స్థానంలో హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ రానుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, రింకూ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫినిషర్‌గా శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రభావం చూపించాడు. మయాంక్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో రెండో టీ20లో బరిలోకి దిగనుంది.
భారత తుదిజట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, ప్రబ్‌సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.


