ఎఫ్‌ఐహెచ్ యూత్ హాకీ5స్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత సబ్‌జూనియర్ బాలుర జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 7-3 తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే రోజు ఆతిథ్య ఒమాన్‌ను 10-1తో చిత్తు చేసి వరుస విజయాలతో అదరగొట్టింది.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోమిత్ పాల్, కరణ్ గౌతమ్, కెప్టెన్ కేతన్ కుష్వాహా తొలి అర్ధభాగంలోనే గోల్స్ చేసి భారత్‌కు 3-0 ఆధిక్యం అందించారు. అనంతరం ప్రహ్లాద్ రాజ్‌భర్, షారుఖ్ అలీ, రాహుల్ యాదవ్, కేతన్ కుష్వాహా మరోసారి గోల్స్ చేయడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.
అంతకుముందు ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేతన్ కుష్వాహా నాలుగు గోల్స్‌తో మెరవగా, షారుఖ్ అలీ, కరణ్ గౌతమ్, ప్రహ్లాద్ రాజ్‌భర్ తలో రెండు గోల్స్ చేసి భారత్‌కు 10-1 తేడాతో భారీ విజయాన్ని అందించారు.
మరోవైపు బాలికల ఎలైట్ పూల్ మ్యాచ్‌లో భారత సబ్‌జూనియర్ జట్టు చైనాతో పోరాడినా 3-6 తేడాతో ఓటమి పాలైంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి స్కోరు 3-3తో సమంగా ఉన్నప్పటికీ, రెండో అర్ధభాగంలో చైనా ఆధిపత్యం చెలాయించి విజయాన్ని అందుకుంది.
ఈ టోర్నీ ద్వారా ప్రారంభ ఎఫ్‌ఐహెచ్ యూత్ హాకీ5స్ ప్రపంచకప్‌కు ఆసియా జట్ల ఎంపిక కూడా జరగనుంది.


