PC: MMA Twitter
భారత రెజ్లింగ్ దిగ్గజం, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ సంగ్రామ్ సింగ్ తన కెరీర్‌లోనే కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక స్ట్రైక్ ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పాకిస్తాన్ రెజ్లర్ అబిద్ అలీతో తలపడనున్నాడు. రెండు దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న ఈ పోరు భారత కాలమనా ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.

PC: MMA Twitter
ఈ టైటిల్ ఫైట్ కంబాట్ క్రీడా వర్గాల్లో భారీగా అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ ఫైట్‌లో గెలిచిన వారికి స్ట్రైక్ ఆసియా చాంపియన్ కిరీటం దక్కనుంది. 40 ఏండ్ల వయసులో ప్రొఫెషనల్ రెజ్లర్ నుంచి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ప్లేయర్‌గా మారిన సంగ్రామ్ సింగ్ ఇప్పటివరకు తన అన్ని కంబాట్స్‌లోనే గెలిచి అజేయంగా నిలిచాడు. ఎంఎంఏ కెరీర్ ఆరంభించిన తర్వాత జార్జియాలో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు చెందిన అలీ రజా నాసిర్‌ను కేవలం 90 సెకన్లలో ఓడించి ప్రపంచ వేదికపై తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడు.
ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో ట్యూనీషియాకు చెందిన హకీమ్ ట్రాబెల్సీపై, అర్జెంటీనాలో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోరియన్ కౌడియర్‌పై వరుస విజయాలు నమోదు చేశాడు. అర్జెంటీనా గడ్డపై ప్రొఫెషనల్ ఎంఎంఏ బౌట్‌లో గెలిచిన తొలి భారతీయుడిగా సంగ్రామ్ సింగ్ రికార్డులకెక్కాడు. దీంతో అతడి అజేయ ప్రొఫెషనల్ రికార్డు 3-0కి విస్తరించింది.

PC: MMA Twitter
కాగా టైటిల్ పోరుకు ముందు సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. 'నేను కేజ్‌లోకి అడుగుపెట్టిన ప్రతీసారి నాకోసం ఆడను. 140 కోట్ల మంది భారతీయుల కోసమే పోరాడతాను. క్రీడ ఏదైనా సరే, భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నా' అని సంగ్రామ్ సింగ్ పేర్కొన్నాడు.
ఆదివారం జరగనున్న పోరులో సంగ్రామ్ గెలిస్తే స్ట్రైక్ ఆసియా చాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు భారత్ నుంచి ప్రపంచ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనున్నాడు.


