వన్డే ప్రపంచకప్‌లో కొత్తగా సూపర్ సిరీస్, సూపర్-7 దశలు
భారత్-పాక్ మ్యాచ్‌లు పెరిగే అవకాశం
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 స్థానంలో సూపర్-10
సెమీఫైనల్‌కు ముందు ఐపీఎల్ తరహా ఎలిమినేటర్ మ్యాచ్‌లు
నవంబర్‌లో ఫైనాన్స్ కమిటీ ఆమోదం తర్వాత తుది అమలు
పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో ఐసీసీ భారీ మార్పులు ప్రకటించింది. టోర్నీల్లో పోటీ స్థాయిని పెంచడం, ప్రతి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం కల్పించడం, అభిమానులకు మరింత ఆసక్తికర అనుభవాన్ని అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.
వన్డే ప్రపంచకప్‌లో ఇలా..!
2027 వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. 2019, 2023 ప్రపంచకప్‌ల్లో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 2015 తర్వాత మళ్లీ 14 జట్లతో టోర్నీ నిర్వహించనున్నారు.
కొత్త ఫార్మాట్‌లో ముందుగా ర్యాంకింగ్స్‌లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు జట్లు తొలి దశలో పోటీ పడతాయి. వీటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది.
ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. రెండు గ్రూపుల నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో అత్యుత్తమంగా నిలిచిన మరో జట్టు 'సూపర్-7' దశకు చేరుకుంటుంది.
గతంలో ఉన్న'సూపర్-6' స్థానంలో ఇప్పుడు 'సూపర్-7' దశను ప్రవేశపెట్టారు. ఈ దశలో అగ్ర నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో తొలి స్థానం జట్టు నాలుగో స్థాన జట్టుతో, రెండో స్థాన జట్టు మూడో స్థాన జట్టుతో తలపడుతుంది.
టీ20 ప్రపంచకప్‌లో 'సూపర్-10'
2028 టీ20 ప్రపంచకప్ ఫార్మాట్‌లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. మొత్తం 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు రెండో దశకు చేరుకుంటాయి.
గతంలో అమల్లో ఉన్న 'సూపర్-8' స్థానంలో ఇప్పుడు 'సూపర్-10' దశను ప్రవేశపెట్టారు. ఇందులో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఐపీఎల్ తరహాలో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడతాయి. ఎలిమినేటర్ విజేతలు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అనంతరం సెమీఫైనల్, ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
అర్హత విధానంలోనూ మార్పులు
2028 టీ20 ప్రపంచకప్ అర్హత విధానంలో కూడా ఐసీసీ సవరణలు చేసింది. స్కాట్లాండ్‌కు యూరప్ రీజినల్ ఫైనల్‌కు నేరుగా ప్రవేశం కల్పించారు. మిగిలిన జట్లు గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతీయ టోర్నీల నుంచి జట్లు ఎంపికై ప్రపంచకప్‌కు చేరతాయి.
పై మార్పులకు ఐసీసీ డెవలప్‌మెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపినా, ఈ ఏడాది నవంబర్‌లో జరిగే ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ సమీక్ష అనంతరం తుది ఆమోదం లభించనుంది.
భారత్-పాక్ మ్యాచ్‌లు పెరిగే అవకాశం
కొత్త ఫార్మాట్‌తో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉంటే గ్రూప్ దశలో ఒకసారి తలపడే అవకాశం ఉంది. అనంతరం రెండు జట్లు సూపర్-7కు (వన్డే) చేరితే మరోసారి ముఖాముఖి అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచకప్‌లో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య కనీసం రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశాలు పెరుగుతాయి.


