మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌ | Shubman Gill Nears No 1 Spot, Joe Root, Axar Patel Gain Big In ICC ODI Rankings, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

Jul 15 2026 3:50 PM | Updated on Jul 15 2026 4:14 PM

Shubman Gill Nears No 1 Spot, Joe Root, Axar Patel Gain Big In ICC ODI Rankings

Source: The Economic Times

భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే అనంతరం ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ప్రపంచ నంబర్-1 బ్యాటర్ స్థానానికి మరింత చేరువయ్యాడు.

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన గిల్‌కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం అతను ప్రపంచ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్‌ను (814) అధిగమించేందుకు గిల్‌కు (803) ఇంకా 12 రేటింగ్ పాయింట్లు మాత్రమే అవసరం. మరో మంచి ఇన్నింగ్స్‌ గిల​్‌ను అగ్రపీఠంపై కూర్చోబెట్టడం ఖాయం.

తొలి వన్డేలో విఫలమైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (3వ స్థానం), రోహిత్ శర్మ (4వ స్థానం) తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

భారత ఆటగాళ్లకు భారీ లబ్ది
దీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌పై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరుకున్నాడు.

అలాగే తొలి వన్డేలో అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. బ్యాట్‌తో అజేయ అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానానికి చేరుకున్నాడు.

ఇంగ్లండ్ ఆటగాళ్లకు కూడా మెరుగైన ర్యాంకులు
ఇంగ్లండ్ తరఫున తొలి వన్డేలో 76 పరుగులు చేసిన జో రూట్ 12వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే అర్ధశతకంతో ఆకట్టుకున్న లియామ్ డాసన్ బ్యాటర్ల జాబితాలో 81 స్థానాలు ఎగబాకి 262వ స్థానంలో నిలిచాడు.

ఇతర దేశాల ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్, వెస్టిండీస్ బ్యాటర్ కీసీ కార్టీ, జింబాబ్వే ఆటగాళ్లు బెన్ కర్రన్‌, బ్రాడ్ ఇవాన్స్ కూడా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన పురోగతి సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement