అక్ష‌ర్ ప‌టేల్ అరుదైన ఫీట్‌.. ఆ ఇద్ద‌రి స‌ర‌స‌న చోటు | Axar-Patel-Only-3rd-Indian-Achieve Massive-Feat Vs ENG 1st-ODI | Sakshi
Sakshi News home page

అక్ష‌ర్ ప‌టేల్ అరుదైన ఫీట్‌.. ఆ ఇద్ద‌రి స‌ర‌స‌న చోటు

Jul 15 2026 1:48 PM | Updated on Jul 15 2026 1:58 PM

Axar-Patel-Only-3rd-Indian-Achieve Massive-Feat Vs ENG 1st-ODI

Photo Credit: BCCI Twitter

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో తొలి వ‌న్డేలో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో నాలుగు వికెట్లు, ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో (57 నాటౌట్‌) అజేయ అర్ధ‌సెంచ‌రీ సాధించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. టీమిండియా త‌ర‌ఫున‌ వ‌న్డే మ్యాచ్‌లో నాలుగు వికెట్ల‌తో పాటు అర్ధ‌సెంచ‌రీ లేదా సెంచ‌రీ సాధించిన మూడో ప్లేయ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ రికార్డులకెక్కాడు. 

ఈ నేప‌థ్యంలో అక్ష‌ర్ ప‌టేల్ భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా స‌ర‌స‌న చోటు సంపాదించాడు. 1998లో ఢాకా వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ (141 ప‌రుగులు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో పాటు బౌలింగ్‌లో 38 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డగొట్టి ఆనాటి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. ఆ త‌ర్వాత 2022లో మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో పాండ్యా బ్యాటింగ్‌లో 71 ప‌రుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో 24 ప‌రుగులిచ్చి నాలుగు కీల‌క వికెట్లు తీశాడు.

మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్‌ (76 బంతుల్లో 76 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), లియామ్‌ డాసన్‌ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. 

అనంతరం భారత్‌ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (75 బంతుల్లో 80 రిటైర్ట్‌హర్ట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (52 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (63 బంతుల్లో 52 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. కార్డిఫ్‌లో రేపు రెండో వన్డే జరుగుతుంది.  

 

Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement