భారత్‌తో సిరీస్‌కు ముందు జింబాబ్వే ఆటగాడికి షాక్ | Zimbabwe Fast Bowler Punished By ICC Before India Series | Sakshi
Sakshi News home page

భారత్‌తో సిరీస్‌కు ముందు జింబాబ్వే ఆటగాడికి షాక్

Jul 13 2026 6:57 PM | Updated on Jul 13 2026 7:09 PM

Zimbabwe Fast Bowler Punished By ICC Before India Series

Source: Cricinfo

త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే ఫాస్ట్‌ బౌలర్‌ తనాకా చివంగా షాక్‌ తగిలింది. అతడిపై ఐసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు చివంగాకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.

ఐసీసీ మీడియా ప్రకటన ప్రకారం, ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బందికి సంబంధించిన ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ను చివంగా ఉల్లంఘించాడు. ఈ నిబంధన అంతర్జాతీయ మ్యాచ్‌లలో వినిపించేలా అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా సహచర ఆటగాడు ఇన్నోసెంట్ కాయా నుంచి ఆశించినంత వేగంగా త్రో రాకపోవడంతో నిరాశకు గురైన చివంగా, అందరికీ వినిపించేలా అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఐసీసీ గుర్తించింది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ గిల్బర్ట్ విధించిన శిక్షను చివంగా అంగీకరించాడు.

గత 24 నెలల్లో చివంగా చేసిన తొలి క్రమశిక్షణ ఉల్లంఘన ఇదే కావడంతో అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే చేరింది.

ఇక సిరీస్ విషయానికి వస్తే, మూడో వన్డేలో బంగ్లాదేశ్ 200 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించి ఓదార్పు విజయం సాధించింది. అప్పటికే తొలి రెండు వన్డేల్లో గెలిచిన జింబాబ్వే 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

జులై 23 నుంచి జింబాబ్వే స్వదేశంలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ హరారే వేదికగా 23, 25, 26 తేదీల్లో జరుగనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement