ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా.. 15 పతకాలు ఖరారు | 8 Indians In Finals, 7 Bronze Medals Secured In Asian U 19, U 23 Boxing Championships | Sakshi
Sakshi News home page

ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా.. 15 పతకాలు ఖరారు

Jul 13 2026 5:07 PM | Updated on Jul 13 2026 5:11 PM

8 Indians In Finals, 7 Bronze Medals Secured In Asian U 19, U 23 Boxing Championships

Photo credit: Instagram

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అండర్-23 పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకోగా, మరో ఏడుగురు సెమీఫైనల్లో ఓడినా కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు.

మహిళల అండర్-23 విభాగంలో నిషా (54 కేజీలు) దక్షిణ కొరియాకు చెందిన హ్యేజూ లీపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. నికితా చంద్ (60 కేజీలు) జపాన్‌కు చెందిన సారీ కొకుఫును ఓడించగా, కాజల్ (65 కేజీలు) కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన గుల్జినా మెల్స్‌వెక్‌పై ఏకపక్ష విజయం సాధించింది.

ముస్కాన్ (75 కేజీలు) ఉజ్బెకిస్థాన్‌కు చెందిన టోయిరోవా ఓయ్షాపై 5-0 తేడాతో గెలవగా, ప్రియాంక (80 కేజీలు) కజకిస్థాన్‌కు చెందిన పనార్ సెయిట్‌ఖాంకిజీపై అదే 5-0 స్కోరుతో విజయం సాధించింది. ఈ మూడు బౌట్లలో భారత బాక్సర్ల ఆధిపత్యం కారణంగా రిఫరీ పోటీలను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.

పురుషుల అండర్-23 విభాగంలో విశ్వనాథ్ సురేశ్ (50 కేజీలు) ఫిలిప్పీన్స్ ప్రత్యర్థిని 5-0తో చిత్తు చేశాడు. గంగా (55 కేజీలు) జపాన్ బాక్సర్‌పై 3-2 స్ప్లిట్ డెసిషన్‌తో గెలిచి ఫైనల్‌కు చేరాడు. వంశజ్ (65 కేజీలు) కిర్గిజ్‌స్తాన్ ప్రత్యర్థిపై 4-1 తేడాతో విజయం సాధించి బంగారు పతక పోరుకు అర్హత సాధించాడు.

భారత్ ఖాతాలో చేరిన ఏడు కాంస్య పతకాలు
మహిళల అండర్-23 విభాగంలో తను (51 కేజీలు), ప్రాచి (57 కేజీలు), శివాని (70 కేజీలు), నైనా (80 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో హితేష్ (70 కేజీలు), నీరజ్ (75 కేజీలు), ఇషాన్ కటారియా (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.

ఫైనల్‌కు చేరిన ఎనిమిది మందితో కలుపుకుంటే భారత్‌కు మొత్తం 15 పతకాలు (8 స్వర్ణాలు లేదా రజతాలు) ఖరారయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement