వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదని ప్రధాన కోచ్ డారెన్ సామీ స్పష్టం చేశాడు. ఇటీవల హోల్డర్ వన్డేలకు వీడ్కోలు పలికాడని చేసిన వ్యాఖ్యలు తప్పని అంగీకరిస్తూ, వాటిని వెనక్కి తీసుకున్నాడు.
జూలై 12న మీడియాతో మాట్లాడిన సామీ, హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడని పేర్కొన్నాడు. అయితే ఆ వ్యాఖ్యలు గందరగోళానికి దారితీయడంతో, అనంతరం అధికారికంగా వివరణ ఇచ్చాడు.
"జేసన్ హోల్డర్ అంతర్జాతీయ భవిష్యత్తుపై మాట్లాడుతున్నప్పుడు నేను పొరపాటున అతను వన్డేలకు రిటైర్ అయ్యాడని చెప్పాను. అది నా తప్పు. ఈ వ్యాఖ్యల వల్ల జేసన్ హోల్డర్‌కు, క్రికెట్ వెస్టిండీస్‌కు, అభిమానులకు కలిగిన గందరగోళానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను" అని సామీ వెల్లడించాడు.
సామీ ఇంకా మాట్లాడుతూ, "వాస్తవానికి హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి నిరవధిక విరామం మాత్రమే తీసుకున్నాడు. అతను రిటైర్ కాలేదు. వన్డే జట్టు ఎంపికకు అతడు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో అతని అందుబాటుపై క్రికెట్ వెస్టిండీస్‌తో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయి" అని వివరించాడు.
కాగా, హోల్డర్ గత కొంతకాలంగా వన్డేలకు దూరంగా ఉన్నాడు. అయితే టీ20 క్రికెట్‌లో మాత్రం చురుగ్గా కొనసాగుతున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ తరఫున ఆడిన అతను ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి, జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
హోల్డర్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. అతడు ఇప్పటివరకు 138 మ్యాచ్‌లు ఆడి 2,237 పరుగులు చేయడంతో పాటు 159 వికెట్లు పడగొట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్‌లోనే చివరిసారిగా వన్డే ఆడిన హోల్డర్, వెస్టిండీస్‌కు 86 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 24 విజయాలు అందించాడు.


