సీఎస్‌కే కోచ్‌ పదవికి స్టీఫెన్‌ ప్లెమింగ్‌ గుడ్‌ బై | Stephen Fleming Steps Down As CSK Head Coach Ends 18 Years Bond | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే కోచ్‌ పదవికి స్టీఫెన్‌ ప్లెమింగ్‌ గుడ్‌ బై

Jul 13 2026 12:10 PM | Updated on Jul 13 2026 1:19 PM

Stephen Fleming Steps Down As CSK Head Coach Ends 18 Years Bond

Source: CSK Twitter

ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే)కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు స్టీఫెన్‌ ప్లెమింగ్‌ సోమవారం ప్రకటించాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం ‘ఎక్స్‌’ వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది. కాగా ఐపీఎల్‌ ఆరంభం నుంచి సీఎస్‌కే జట్టుతోనే కొనసాగిన ప్లెమింగ్‌ తాజాగా కోచ్‌ పదవి నుంచి తప్పుకోవడంతో 18 ఏళ్ల బంధానికి ముగింపు పడినట్లయింది.

'ఇన్నేళ్ల నా ప్రయాణంలో సీఎస్‌కేకు కోచ్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సీఎస్‌కే సాధించిన ప్రతీ విజయంలోనే నేను భాగస్వామ్యం కావడం పట్ల గర్వపడుతున్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన సీఎస్‌కే యాజమాన్యానికి, అలాగే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని అధిగమించడంలో నా వంతు కృషి చేశాను. 18 ఏళ్ల బంధానికి ముగింపు పడినప్పటికీ సీఎస్‌కే జట్టుతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. థాంక్యూ సీఎస్‌కే’ అని ప్లెమింగ్‌ భావోద్వేగంతో రాసుకొచ్చాడు.


(Source: CSK Twitter)

స్టీఫెన్ ప్లెమింగ్ నిర్ణ‌యాన్ని అంగీక‌రిస్తూ సీఎస్‌కూ కూడా ప్ర‌తిగా ఎక్స్‌లో ఎమోష‌న్‌తో కూడిన పోస్టును పంచుకుంది. 'సీఎస్‌కేతో 18 ఏళ్ల బంధానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని నిర్ణ‌యం తీసుకున్న స్టీఫెన్ ప్లెమింగ్ నిర్ణ‌యం బాధ క‌లిగించింది. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ నుంచి సీఎస్‌కే జ‌ట్టులో మీ ముద్ర ఎప్ప‌టికీ నిలిచిపోతుంది. జ‌ట్టు సాధించిన విజ‌యాల్లో మీరు కీల‌కంగా నిల‌వ‌డం గొప్ప విష‌యం. సుదీర్ఘ ప్ర‌యాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా త‌ట్టుకొని నిలబ‌డేలా మీరు ప్రోత్స‌హించిన విధానం అద్భుతం. మీరు నిర్మించిన వార‌స‌త్వం మాకు స్ఫూర్తినిస్తుంది. థాంక్యూ స్టీఫెన్ ప్లెమింగ్' అని పేర్కొంది.


(Source: CSK Twitter)

ప్లేయర్‌ నుంచి సక్సెస్‌ఫుల్‌ కోచ్‌ వరకు
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్‌ 2008లో ఆట‌గాడిగా సీఎస్‌కే జ‌ట్టులో చేరాడు. ఆ త‌ర్వాత 2009 నుంచి కోచింగ్ బృందంలో చేశాడు. 2016, 2017 సంవ‌త్స‌రాల్లో చెన్నై జ‌ట్టుపై స‌స్పెన్ష‌న్ విధించ‌గా.. ఆ స‌మ‌యంలో అత‌ను పూణె జ‌ట్టుకు కోచ్‌గా ప‌ని చేశాడు. 2017లో పూణె జ‌ట్టు ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. కోచ్‌గా ఫ్లెమింగ్ ఉన్న స‌మ‌యంలో చెన్నై జ‌ట్టు 11 సార్లు ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశించింది. 10 సార్లు ఐపీఎల్‌లో, ఒక‌ సారి చాంపియ‌న్స్ లీగ్‌లో ఫైన‌ల్స్‌కు చేరుకుంది. ఇందులో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్‌, ఒక‌సారి చాంపియ‌న్స్ లీగ్ టైటిల్‌ను సాధించింది.


ధోనితో స్టీఫెన్ ప్లెమింగ్ (Source: CSK Twitter)

విడదీయలేని బంధం
ముఖ్యంగా ధోనితో ప్లెమింగ్ బంధం మ‌రువ‌లేనిది. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో ఇద్ద‌రు ఒకే జ‌ట్టుకు ఆడారు. ఆ త‌ర్వాత ఒక‌రు కోచ్‌గా, మ‌రొక‌రు కెప్టెన్‌గా వ్య‌హ‌రించారు. ధోని మాస్ట‌ర్ మైండ్ వెనుక కోచ్‌గా ప్లెమింగ్ కూడా కీల‌క‌పాత్ర పోషించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో వేరే ఫ్రాంచైజీల‌కు హెడ్‌కోచ్‌లు మారుతూ వ‌చ్చిన‌ప్ప‌టికీ సీఎస్‌కే మాత్రం ప్లెమింగ్‌నే త‌మ ప్ర‌ధాన కోచ్‌గా అట్టిపెట్టుకోవ‌డంలో ధోని పాత్ర మ‌రువ‌లేనిది. 2022లో ధోని కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోగానే ప్లెమింగ్ కూడా కోచ్ పాత్ర‌ను వ‌దిలేద్దామ‌నుకున్నాడు. కానీ ధోని వ‌ద్ద‌ని చెప్ప‌డంతో ప్లెమింగ్ త‌న ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాడు. ఈ స్నేహ‌మే 18 ఏళ్ల సీఎస్కే ప్ర‌యాణంలో ధోని, ప్లెమింగ్ బంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌రిచింది.

 

 

Read: భారీ మార్పునకు ఫిఫా ప్లాన్‌.. భారత్‌కు బిగ్‌ చాన్స్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement