లండన్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు ఆడిన యానిక్ సినెర్ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టాప్ సీడ్ సినెర్ (ఇటలీ) పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.
మూడు గంటల 46 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సినెర్ 6–7 (7/9), 7–6 (7/2), 6–3, 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. గత ఏడాది కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)పై నాలుగు సెట్‌లలో గెలిచిన సినెర్... ఈ ఏడాది కూడా ఫైనల్ పోరులో నాలుగు సెట్‌లలోనే విజయం అందుకున్నాడు.
ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
విజేత సినెర్‌కు 35 లక్షల పౌండ్లు (రూ. 46 కోట్లు), రన్నరప్ జ్వెరెవ్‌కు 18 లక్షల పౌండ్లు (రూ. 23 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదిలా ఉంటే... గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన జ్వెరెవ్ అదే ఫలితాన్ని వింబుల్డన్‌లో పునరావృతం చేయలేకపోయాడు.
పదో ప్రయత్నంలో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన జ్వెరెవ్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి జోరు మీద ఉన్నట్లు కనిపించాడు. కానీ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సినెర్ గెలిచి స్కోరును సమం చేశాడు.
మూడో సెట్‌లోని ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్... తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లోని ఏడో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్... ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని 6–4తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను హస్తగతం చేసుకున్నాడు. సినెర్ కెరీర్‌లో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్.
పదో ప్లేయర్‌గా
ఓపెన్ శకంలో (1968 నుంచి) వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కనీసం వరుసగా రెండేళ్లు సాధించిన పదో ప్లేయర్‌గా యానిక్ సినెర్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రాడ్ లేవర్, జాన్ న్యూకోంబ్, జాన్ బోర్గ్, జాన్ మెకన్రో, బోరిస్ బెకర్, పీట్ సంప్రాస్, రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్, అల్‌కరాజ్ ఉన్నారు.


