పురుషుల సింగిల్స్ ఫైనల్లో సినెర్, జ్వెరెవ్
లండన్: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశిస్తున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ వరుస సెట్‌లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను ఓడించి వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి ప్రవేశించాడు.
2 గంటల 20 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సినెర్ 16 ఏస్‌లు సంధించాడు. మూడుసార్లు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో సినెర్ తలపడతాడు. మరో సెమీఫైనల్లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జ్వెరెవ్ 2 గంటల 14 నిమిషాల్లో 7–6 (7/0), 6–2, 6–4తో ‘వైల్డ్ కార్డు’ ప్లేయర్ ఆర్థర్ ఫెరీ (బ్రిటన్)పై గెలిచాడు.
ఈ క్రమంలో తొమ్మిదో ప్రయత్నంలో జ్వెరెవ్ తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ విజయంతో జ్వెరెవ్ కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో... ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో... ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరుకున్న ఏడో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే, అల్‌కరాజ్ ఉన్నారు.


