సబలెంకా నిష్క్రమణ | Sabalenka loses to Osaka in pre quarters | Sakshi
Sakshi News home page

సబలెంకా నిష్క్రమణ

Jul 6 2026 3:57 AM | Updated on Jul 6 2026 3:57 AM

Sabalenka loses to Osaka in pre quarters

ప్రిక్వార్టర్స్‌లో ఒసాకా చేతిలో ఓటమి

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారూస్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగింది. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) సాధికారిక ఆటతీరుతో సబలెంకాను బోల్తా కొట్టించింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఒసాకా 6–2, 7–6 (7/2)తో సబలెంకాను ఓడించి తొలిసారి వింబుల్డన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ ఒసాకా ఎనిమిది ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కోల్పోకుండా సబలెంకా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. ఆరేళ్ల తర్వాత సబలెంకా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌లో వరుస సెట్‌లలో ఓడిపోవడం గమనార్హం. చివరిసారి 2020 యూఎస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో అజరెంకా (బెలారూస్‌) 6–1, 6–3తో సబలెంకాను ఓడించింది. మరోవైపు నాలుగో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా), కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో పెగూలా 4–6, 6–3, 6–1తో ఇవా జోవిచ్‌ (అమెరికా)పై, ముకోవా 7–5, 5–7, 6–3తో 2024 చాంపియన్‌ బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందారు. 

జొకోవిచ్‌ ‘రికార్డు’ విజయం 
పురుషుల సింగిల్స్‌లో ఏడుసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ 17వసారి వింబుల్డన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 7–6 (8//6), 6–3, 3–6, 6–3తో రోమన్‌ సఫియులిన్‌ (రష్యా)పై గెలుపొందాడు. ఈ క్రమంలో వింబుల్డన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు అందుకున్న ప్లేయర్‌గా జొకోవిచ్‌ (106) రికార్డు నెలకొల్పాడు. 105 విజయాలతో ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement