వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన విండీస్‌ ఓపెనర్‌ | Taylor, Matthews tons drub Ireland as WI clinch series | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన విండీస్‌ ఓపెనర్‌

Jul 13 2026 3:17 PM | Updated on Jul 13 2026 3:36 PM

Taylor, Matthews tons drub Ireland as WI clinch series

Photo credit: Instagram

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ఓపెనర్‌ హేలీ మాథ్యూస్ (100), వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టెఫానీ టేలర్ (100 నాటౌట్‌) సూపర్‌ సెంచరీలతో చెలరేగడంతో ఐర్లాండ్‌ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్‌ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 39 ఓవర్లలోనే ఛేదించింది. 

ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మాథ్యూస్‌కు ఇది వరుసగా రెండో వన్డే సెంచరీ. ఇదే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా ఆమె శతక్కొట్టింది.

మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళితే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అమీ హంటర్ 67, రెబెక్కా స్టోకెల్ 57 పరుగులతో జట్టును ఆదుకున్నారు. చివర్లో లియా పాల్ 30 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ (2/34), డియాండ్రా డాటిన్ (2/15) రాణించారు.

241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఓవర్లోనే ఓపెనర్ రియలియానా గ్రిమాండ్ (0) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్ ఐర్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. 

వీరిద్దరూ రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. చివరి వరకు క్రీజులో నిలిచిన టేలర్, షెమైన్ క్యాంప్‌బెల్‌ (10 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ సిరీస్‌లో నామమాత్రపు చివరి వన్డే జులై 15న జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement