చరిత్రాత్మక లార్డ్స్ టెస్ట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్మాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 341-7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక భాటియా (113) సూపర్ సెంచరీతో, ఆఖర్లో రిచా ఘోష్ (50 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో చెలరేగారు. స్మృతి మంధాన (70) అర్ద సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో రాణించింది.
అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.
దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.
కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరుగతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనత, సెంచరీ చేసి క్రాంతి గౌడ్, యస్తిక భాటియా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు. లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గా క్రాంతి.. తొలి సెంచరీ చేసిన బ్యాటర్ యస్తిక రికార్డు సృష్టించారు.


