చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌ | YASTIKA BHATIA Becomes the first batter ever to score a Hundred at Lords in Womens Test Cricket | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

Jul 12 2026 6:43 PM | Updated on Jul 12 2026 6:46 PM

YASTIKA BHATIA Becomes the first batter ever to score a Hundred at Lords in Womens Test Cricket

చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు వికెట్‌కీపర్-బ్యాటర్ యస్తిక భాటియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మూడో రోజు ఆటలో అద్భుత సెంచరీ సాధించింది. తద్వారా లార్డ్స్‌లో తొలి టెస్ట్‌ శతకం నమోదు చేసిన మహిళా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరును చిరస్థాయిగా లిఖించుకుంది.

మూడో రోజు స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన యస్తిక, ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. మంధానా 70 పరుగుల వద్ద ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మిస్తూ భారత్ ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది.

భోజన విరామ సమయానికి 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యస్తిక, విరామం అనంతరం కేవలం ఆరు బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసింది. ఇస్సీ వాంగ్ వేసిన 68వ ఓవర్ చివరి బంతిని కవర్స్ వైపు సింగిల్ తీసి 145 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని అందుకుంది.

ఈ సెంచరీతో యస్తిక మరో అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది. లార్డ్స్‌లో టెస్టు సెంచరీ చేసిన రెండో భారత ఎడమచేతి బ్యాటర్‌గా (పురుషులు, మహిళలు) నిలిచింది. 1996లో తన అరంగేట్రం టెస్టులో సౌరవ్ గంగూలీ చేసిన 131 పరుగుల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఎడమచేతి బ్యాటర్ యస్తికనే.

ఇదే మ్యాచ్‌లో భారత యువ పేసర్ క్రాంతి గౌడ్ కూడా ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌తో ఆమె ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఈ ఘనత సాధించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి 402 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యస్తిక సెంచరీ (113) అనంతరం ఔటైంది. రిచా ఘోష్‌ (15), స్నేహ్‌ రాణా (0) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, భారత​్‌-ఇంగ్లండ్‌ మధ్య లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఇదే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement