వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ (జులై 12) జరిగిన తొలి వన్డేలో ఓ వివాదాస్పద అంశం చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు కీసీ కార్టీ బ్యాట్ స్టంప్స్‌ను తాకి బెయిల్స్ కిందపడినా టీవీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.
267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ పటిష్ఠ స్థితిలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 35వ ఓవర్ రెండో బంతిని జాకబ్ డఫీ వేయగా, కార్టీ పుల్ షాట్ ఆడి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా 69 మీటర్ల సిక్సర్ బాదాడు. అయితే షాట్ ఆడిన వెంటనే అతని బ్యాట్ స్టంప్స్‌ను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి.
Should the Kiwis feel hard done by with this Hit Wicket being called Not Out?! pic.twitter.com/XlTNEw5KPq
— The ACC (@TheACCnz) July 12, 2026
దీంతో ఫీల్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ వెంటనే స్క్వేర్ లెగ్ అంపైర్‌తో చర్చించి నిర్ణయాన్ని టీవీ అంపైర్ అహ్సన్ రజాకు పంపించాడు. అప్పటికి కార్టీ 64 పరుగులతో క్రీజులో ఉండగా, వెస్టిండీస్ 34 ఓవర్లలో 170/2తో విజయానికి చేరువలో ఉంది.
పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్ కార్టీని నాటౌట్‌గా ప్రకటించాడు. షాట్ పూర్తయిన తర్వాతే బ్యాట్ స్టంప్స్‌ను తాకిందని, అప్పటికే బంతి సిక్సర్‌గా బౌండరీ దాటినందున హిట్ వికెట్ నిబంధన వర్తించదని స్పష్టం చేశాడు.
ఎంసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి ఆటలో ఉన్న సమయంలో మాత్రమే హిట్ వికెట్‌గా బ్యాటర్‌ను ఔట్ ఇవ్వవచ్చు. షాట్ ఆడే సమయంలో లేదా వెంటనే పరుగుకు బయలుదేరే క్రమంలో స్టంప్స్‌ను కూల్చితే మాత్రమే హిట్ వికెట్ వర్తిస్తుంది.
కానీ బంతి అప్పటికే బౌండరీ దాటి ఫోర్ లేదా సిక్సర్‌గా నమోదైన తర్వాత ఆట ముగిసినట్లే పరిగణిస్తారు. ఆ తర్వాత స్టంప్స్‌ను తాకినా బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించలేరు.
అంపైర్ నిర్ణయం అనంతరం కార్టీ మరింత ధైర్యంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.
ఈ ఘటనతో హిట్ వికెట్ నిబంధన చర్చనీయాంశంగా మారింది. 2005 యాషెస్‌లో షేన్ వార్న్, 2002లో ఇంజమామ్ ఉల్ హక్ వంటి ప్రముఖ ఆటగాళ్లు హిట్ వికెట్‌గా ఔటైన ఘటనలను అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


