టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించారు. వరుసగా విఫలమవుతున్నప్పటికి జట్టులో దూబేను కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్న దూబే తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.
ఇంగ్లండ్ పిచ్‌లపై షార్ట్ బంతులను ఆడలేక అతడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. శనివారం రోజ్‌బౌల్ వేదికగా జరిగిన ఐదో టీ20లో కూడా దూబే దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసిన దూబే.. రెండు వికెట్లు పడగొట్టినప్పటికి ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు.
బ్యాటింగ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా ఫీల్డింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను దూబే జారవిడిచాడు. 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న బ్రూక్ ఏకంగా 95 రన్స్ చేశాడు. దీంతో దూబే ఫీల్డింగ్ తీరుపై కూడా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"శివమ్ దూబే ఉంటే మైదానంలో మనం మ్యాచ్‌లు గెలవడం కష్టమే. బంతి ఎటు వెళ్తుందో అంచనా వేయకుండా దాని చుట్టూ తిరుగుతుంటాడు. అతడు చాలా నెమ్మదిగా, అయోమయంగా ఉంటున్నాడు. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా అతను క్యాచ్‌లు వదిలేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
అసలు దూబే లాంటి ఆటగాడిని ఆల్‌రౌండర్ అనడమే ఒక జోక్. అతడిని ఇంటర్ననేషనల్ క్రికెటర్ అంటే నవ్వుస్తోంది. దూబే క్యాచ్ వదిలేయడం వల్లే ప్రిన్స్ యాదవ్ రిథమ్ దెబ్బతింది. దూబే ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే, మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా


