టీ20 ప్రపంచకప్-2026 ఛాంపియన్ టీమిండియా ప్రస్తుతం తమ పేలవ ఆట తీరుతో అభిమానులను తీవ్ర నిరాశపరుస్తోంది. యూకే పర్యటనలో భారత జట్టు వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లను కోల్పోయింది. కనీసం రోజ్‌బౌల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లోనైనా గెలిచి టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ భావించారు.
కానీ చివరి మ్యాచ్‌లో కూడా ఓటమి పాలై 4-0 తేడాతో సిరీస్‌ను ఇంగ్లండ్‌కు సమర్పించుకుంది. భారత్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. ఈ టూర్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మన జట్టు విఫలమైంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ పక్కన పెడితే.. ప్రస్తుతం టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న మరో సమస్య మరో సమస్య 'ఫీల్డింగ్ వైఫల్యం'.
చెత్త ఫీల్డింగ్ కారణంగా భారత్ ఘోర ఓటములను మూటకట్టుకోవాల్సి వస్తోంది. రోజ్‌బౌల్ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ భారత ఫీల్డింగ్ వైఫల్యం బయటపడింది. శివమ్ దూబే వదిలేసిన సునాయస క్యాచ్.. టీమిండియా ఓటమిని శాసించిందే అనే చెప్పాలి.
కొంపముంచిన దూబే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను అవుట్ చేసి ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆరో ఓవర్‌లో ప్రిన్స్ యాదవ్ ఆఫ్ స్టంప్‌నకు వెలుపల ఒక షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ డెలివరీని బ్రూక్ స్క్వేర్ లెగ్' వైపు పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని 'థర్డ్ మ్యాన్' దిశగా గాల్లోకి లేచింది. అయితే ఇన్‌ఫీల్డ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిన దూబే ఆ క్యాచ్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ బంతి గమనాన్ని అంచనా వేయడంలో దూబే పూర్తిగా విఫలమయ్యాడు.
బంతిని దాటి ముందుకు వెళ్లిపోయాడు. కనీసం బంతి అతడి చేతికి కూడా తాకలేదు. దీంతో లడ్డూలాంటి క్యాచ్ నేలపాలైంది ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఆ తర్వాత భారత బౌలర్లను ఉతికారేశాడు.
కేవలం 46 బంతుల్లోనే 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని హ్యరీ నెలకొల్పాడు. ఒకవేళ ఆ క్యాచ్‌ను దూబే అందుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ సిరీస్ మొత్తంగా భారత్ మొత్తంగా 5 క్యాచ్‌లు డ్రాప్ చేసింది.
చెత్త రికార్డు
ఈ ఒక్క సిరీస్‌లో మాత్రమే కాదు గత కొన్నాళ్లగా భారత ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. టీ20 ప్రపంచకప్-2026 నుంచి టీమిండియా ఫీల్డర్లు దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ క్యాచ్‌లను జారవిడుస్తున్నారు. ప్రస్తుతం అత్యంత చెత్త క్యాచ్ రికార్డు ఉన్న జట్లలో బంగ్లాదేశ్, ఐర్లాండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.
టీ20 ప్రపంచకప్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ ఏకంగా 13 క్యాచ్‌లను నేలపాలు చేసింది. వీలైనంత త్వరగా భారత జట్టును తమ ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోపోతే మరిన్ని ఓటములను చవిచూడాల్సి వస్తోంది. ఇంగ్లండ్ టూర్ తర్వాత భారత ఫీల్డింగ్ కోచ్ పదవి నుంచి టి. దిలీప్ తప్పుకోనున్నట్లు సమాచారం.


