Photo Credit: BCCI Twitter
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో దారుణ పరాజయం తర్వాత శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.
వీరితో పాటు సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్‌పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
టీ20 సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లు తమ బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్‌లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.
ఆల్‌రౌండ్ విభాగంలో అక్షర్‌పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్‌లో విఫలమైనప్పటికీ అర్ష్‌దీప్‌కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్‌లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్‌లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్‌కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది.
మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.
తుదిజట్టు అంచనా:
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్


