భారత మహిళల పంచ్‌ అదుర్స్‌ | Indian women boxers win gold medals at Asian Senior Boxing Championship | Sakshi
Sakshi News home page

భారత మహిళల పంచ్‌ అదుర్స్‌

Apr 10 2026 4:10 AM | Updated on Apr 10 2026 4:10 AM

Indian women boxers win gold medals at Asian Senior Boxing Championship

స్వర్ణాలు గెలిచిన మీనాక్షి, ప్రీతి, అరుంధతి, ప్రియ  

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్‌ పవర్‌ను చాటుకున్నారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో నలుగురు భారత బాక్సర్లు మీనాక్షి హుడా (48 కేజీలు), ప్రీతి పవార్‌ (54 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు), ప్రియ ఘన్‌ఘస్‌ (60 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జైస్మీన్‌ లంబోరియా (57 కేజీలు), అల్ఫియా పఠాన్‌ (ప్లస్‌ 80 కేజీలు) మాత్రం రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.

ఫైనల్స్‌లో మీనాక్షి 5–0తో నొముందరి (మంగోలియా)పై, ప్రీతి 5–0తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత హువాంగ్‌ సియావో వెన్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచారు. అరుంధతి 4–1తో బకిత్‌ సెడిష్‌ (కజకిస్తాన్‌)పై, ప్రియ 3–0తో వన్‌ ఉన్‌ గ్యోంగ్‌ (ఉత్తర కొరియా)పై నెగ్గారు. జైస్మీన్‌ 0–5తో పున్రావి ర్యునర్స్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, అల్ఫియా 0–5తో దినా ఇస్లామ్‌బెకోవా (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు. 

తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు)... టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన 10 వెయిట్‌ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు పతకాలు నెగ్గడం విశేషం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement