కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్‌ చంద్రశేఖర్‌! | Rajeev Chandrasekhar BJP Kerala Chief Contesting From Nemom interesting facts | Sakshi
Sakshi News home page

కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్‌ చంద్రశేఖర్‌!

Apr 8 2026 4:51 PM | Updated on Apr 8 2026 5:08 PM

Rajeev Chandrasekhar BJP Kerala Chief Contesting From Nemom interesting facts

రాజీవ్‌ చంద్రశేఖర్‌. ఇంజనీర్‌గా మొదలుపెట్టి, వ్యాపారవేత్తగా మారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేత. దేన్ని ఎక్కడ ఎలా ముగించాలి, ఎప్పుడు కొత్త మార్గాల్లో అడుగువేయాలనే ఎరుక కలిగిన వ్యక్తి. కేరళ బీజేపీ సారథిగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల పోరాటాన్ని ముందుండి నడుపుతున్నారు. బీజేపీకి అందని రాష్ట్రమైన కేరళలో ఈసారి ఎలాగైనా గెలుపు అందించి చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉన్నారు. 

మోదీ హవాను పసిగట్టి 
రాజీవ్‌ 2006లో రాజకీయ రంగప్రవేశం చేశారు. కర్ణాటకలోని అధికార జేడీ(ఎస్‌), బీజేపీ కూటమి ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పాలనా సంస్కరణలు, జాతీయ భద్రత, సాయుధ దళాల సిబ్బంది, ముఖ్యంగా మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేశారు. 2012, 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దేశ రాజకీయాలు మోదీకి అనుకూలంగా మారుతున్నాయని రాజీవ్‌ ముందే పసిగట్టారు. 2014కు ముందు నుంచే మోదీని సమరి్థంచడం ప్రారంభించారు. 2020లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. 2021లో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయ మంత్రి అయ్యారు. డిజిటల్‌ పాలన, డేటా భద్రతా విధానాలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. డిజిటల్‌ ఇండియా, ఇంటర్నెట్‌ పాలన, సాంకేతిక విధానాల్లో లోతైన పరిజ్ఞానమున్న పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. 2023లో కేరళ బీజేపీ సారథిగా పగ్గాలందుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ శశిథరూర్‌ చేతిలో ఓడారు. కేరళ చరిత్రలో బీజేపీ గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం నెమోమ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 

ఆసక్తికర నేపథ్యం 
రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వస్థలం కేరళలో త్రిసూర్‌ జిల్లాలోని దేశమంగళం. 1964లో అహ్మదాబాద్‌లో మలయాళీ నాయర్‌ కుటుంబంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్‌ వైమానిక దళంలో ఎయిర్‌ కొమొడోర్‌గా పనిచేశారు. దాంతో రాజీవ్‌ బాల్యం దేశమంతటా భిన్న సంస్కృతుల మధ్య గడిచింది. ఆయన మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. స్టార్టప్‌ల గురించి కనీసం వినని 1981లో ఢిల్లీకి చెందిన ఓ ఐటీ స్టార్టప్‌లో ఉద్యోగం సంపాదించారు. తండ్రి ప్రోత్సాహంతో అమెరికాకు వెళ్లి ఇలినాయీ వర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశారు. ఇంటెల్‌లో డిజైన్‌ ఇంజనీర్‌గా చేసి భారత్‌కొచ్చారు. బీపీఎల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు నంబియార్‌ కుమార్తె అంజును పెళ్లాడారు. 2005లో జుపిటర్‌ క్యాపిటల్‌ అనే పెట్టుబడి సంస్థను స్థాపించారు. రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడే ఏషియానెట్‌ కమ్యూనికేషన్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో యాంకర్‌ అర్నాబ్‌ గోస్వామితో కలిసి రిపబ్లిక్‌ టీవీని స్థాపించారు.

ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

జేబులో పెన్సిల్‌ : ముఖ్య విషయాలు నోట్‌ చేసుకోవడానికి రాజీవ్‌ చంద్రశేఖర్‌ జేబులో నిత్యం పెన్సిల్‌ ఉంచుకుంటారు. ‘‘ప్రతిదాన్నీ తిరగరాయడం ఆయనకిష్టం. చివరకు చరిత్రను కూడా’’అని విపక్ష నేతలు  చమత్కరిస్తుంటారు!  

ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement