సాక్షి, పుణే : దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు ఒక 75 ఏళ్ల పుణే వైద్యుడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే తన డబ్బు 11 రోజుల్లో రెట్టింపు అవుతుందన్న అత్యాశకు పోయి ఒకటీ రెండూ కాదు, ఏకంగా రూ. 12 కోట్లు పోగొట్టుకున్నాడు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెడివతే భారీ లాభాలొస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మ బలికారు. తమ ద్వారా పెట్టుబడి పెడితే, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా రూ. 54 కోట్ల వరకు రాబడి వస్తుందని బాధిత వైద్యుడిని నమ్మించారు. ఆయన ఆసక్తి చూపిన తర్వాత, ఆ సైబర్ మోసగాళ్లు ఆయనను "VIP Stock 24" అనే ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్ ద్వారా, నిందితులు ఎంతో ఆకర్షణీయంగా, లాభదాయకంగా కనిపించే పెట్టుబడి పథకాలను పంచుకున్నారు. దీంతో మోసపోయిన వైద్యుడు తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయన్న ఆశతో, బాధితుడు అనేక వారాల పాటు డబ్బును బదిలీ చేస్తూనే వచ్చారు. అలా 12.31 కోట్లకు దోచేశారు కేటుగాళ్లు.
అసలు ఏం జరిగింది?
ఈ ఏడాది జనవరిలో బాధితుడికి ఒక తెలియని నంబర్ నుండి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయనే సందేశం వచ్చింది. దీనికి వైద్యుడు ఆసక్తి చూపడంతో, నిందితులు ఆయన్ని "VIP Stock 24" అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒక సంస్థ పేరుతో ఉన్న ఒక నకిలీ ట్రేడింగ్ యాప్‌ను ఆయన చేత డౌన్‌లోడ్ చేయించారు. ఆ యాప్‌లో ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు తప్పుడు గణాంకాలను చూపించారు. మరి కొంతమందికి లాభాలు వచ్చినట్టుగా చూపించారు. దీంతో మార్చి 7 నుండి మార్చి 18 మధ్య కేవలం 8 లావాదేవీల ద్వారా డాక్టర్ 12 కోట్లకు పైగా నిందితులు చెప్పిన 8 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. సుమారు మూడు నెలల పాటు లాభాలొస్తాయని ఆశతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తూనే వచ్చారు.
ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్
బెదిరింపులు
ఒకానొక దశలో డాక్టర్ మరిన్ని నిధులు పంపడానికి నిరాకరించగా, నిందితులు ఆయన ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడి ఆయన మరిన్ని నిధులు బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో పాటు, ఇంకా డబ్బు కావాలని వారు వేధించడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!
నోట్ : స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే తగినంత అవగాహన నిపుణుల సలహాలు అవసరం. అతి తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని చెప్పే స్కీములను నమ్మి పోసపోవద్దు. తెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులు, ట్రేడింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.సెబీ (SEBI) గుర్తింపు లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం అని గురించాలి.


