హర్యానాకు చెందిన గ్యాంగ్‌స్టర్ రావు ఇందర్‌జీత్ యాదవ్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు. 2024లో హర్యానాలో ఒక వ్యాపారి హత్య ఆరోపణలతో మధ్యప్రాచ్యానికి పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్ అధికారులు యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన నేర చరిత్ర పత్రాలను దుబాయ్ పోలీసులు కోరారు. త్వరలోనే అతడిని భారత్‌కు రప్పించే (Extradition) ప్రక్రియ పూర్తి చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
యాదవ్‌పై బిజినెస్ మ్యాన్ హత్య, దోపిడీ, ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుండి బలవంతంగా రుణాలు తీసుకోవడం, ఆయుధాలతో బెదిరించడం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా కమీషన్ సంపాదించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అతనిపై హర్యానా , ఉత్తర ప్రదేశ్ పోలీసులు 15కు పైగా కేసులు మరియు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. గత సంవత్సరం ఒక వ్యాపారవేత్త హత్య తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ గ్యాంగ్‌స్టర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.
ఎవరీ రావు ఇందర్‌జీత్ యాదవ్?
2006లో స్థాపించిన 'జెమ్ రికార్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' (Gems Tunes) అనే సంస్థను స్థాపించాడు. రావు ఇందర్‌జీత్ యాదవ్ కేవలం ఒక నిందితుడు మాత్రమే కాదు, సంగీత ప్రపంచంలో కూడా సుపరిచితుడయ్యాడు. ఈ సంస్థ హర్యానా, పంజాబీ, హిందీ భాషల్లో పాటలను నిర్మిస్తూ, OTT ప్లాట్‌ఫారమ్‌గా కూడా ఉండేది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. 2024 డిసెంబర్‌లో ఫైనాన్షియర్ మంజీత్ దిఘల్ హత్యలో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపుఇన్‌స్టాగ్రామ్‌లో ఇతనికి 15 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ప్రధాన ఆరోపణలు
యాదవ్‌పై హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు సుమారు 15కి పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ ఆరోపణల ప్రకారం వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేయడమే ఇతని పని. హత్య, దోపిడీ, ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఇచ్చిన రుణాలను బలవంతపు వసూళ్లు మోసం, వంచన, అక్రమ భూకబ్జా, హింసాత్మక నేరాలు వంటి నేర కార్యకలాపాలలో పాలుపంచు కున్నాడు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల లోన్లను దౌర్జన్యంగా సెటిల్ చేయడం. ఇతను వందల కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలను పరిష్కరించే 'స్ట్రాంగ్‌మ్యాన్'గా వ్యవహరించేవాడు. సింగర్ రాహుల్ ఫాజిల్పురియా ఇంటిపై కాల్పులు, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనల్లో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ దాడులు, పరారీ
మనీ లాండరింగ్ కేసులో భాగంగా గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 5 లగ్జరీ కార్లు, రూ. 17 లక్షల నగదు. కీలకమైన డాక్యుమెంట్లు మరియు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయలను ప్రైవేట్ రుణ లావాదేవీలు మరియు ఆర్థిక వివాదాలను బలవంతంగా పరిష్కరించుకోవడానికి సహకరించేవాడు. కార్పొరేట్ సంస్థలు , ప్రైవేట్ ఫైనాన్షియర్ల మధ్య రుణ పరిష్కారం కోసం యాదవ్ ఒక వెబ్‌సైట్ పోర్టల్‌ను అభివృద్ధి చేసి, నిర్వహిస్తున్నట్లు కూడా తేలింది.
ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్
2024 డిసెంబర్‌లో, ఫైనాన్షియర్ మంజీత్ దిఘాల్ హత్య తరువాత భారత్ నుండి దుబాయ్‌కి పారిపోయాడు. ఈ హత్యకు హిమాంశు భావు అనే ముఠా బాధ్యత వహించింది. ఆ తరువాత గత ఏడాది జూలైలో, గాయకుడు రాహుల్ ఫాజిల్పురియా నివాసంపై జరిగిన కాల్పుల ఘటనలో యాదవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. గురుగ్రామ్‌లో ఫాజిల్పురియా సహాయకుడు రోహిత్ షౌకీన్ హత్యకు తామే బాధ్యులమని ఈ గ్యాంగ్‌స్టర్, అతని అనుచరులు ప్రకటించుకున్నారు. ఆ మరుసటి నెలలోనే, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసంపై జరిగిన కాల్పులకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులలో యాదవ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే తాను గ్యాంగ్‌స్టర్‌ని కాదని, కుట్రకు బలైయ్యానని, తనపై కుట్ర జరుగుతోందని ఇటీవల దుబాయ్‌లో చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?


