రాకెట్‌ నేలకేసి కొట్టి... | Medvedev breaks his racket at the Monte Carlo Masters tournament | Sakshi
Sakshi News home page

రాకెట్‌ నేలకేసి కొట్టి...

Apr 10 2026 3:58 AM | Updated on Apr 10 2026 3:58 AM

Medvedev breaks his racket at the Monte Carlo Masters tournament

రష్యా టెన్నిస్‌ స్టార్‌ మెద్వెదెవ్‌ అసహనం  

మోంటెకార్లో: ప్రపంచ మాజీ నంబర్‌వన్, రష్యా టెన్నిస్‌ ప్లేయర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ సంయమనం కోల్పోయాడు. మోంటెకార్లో మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో భాగంగా... ఘోర పరాజయం మూటగట్టుకున్న మెద్వెదెవ్‌ తన రాకెట్‌ను విరగ్గొట్టాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో పదో ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ 0–6, 0–6తో బెరెటిని (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెద్వెదెవ్‌ తన రాకెట్‌ను వరుసగా ఏడుసార్లు నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. 

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన మెద్వెదెవ్‌... క్రీడా కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. తొలి సెట్‌ కోల్పోయి అసహనంలో ఉన్న మెద్వెదెవ్‌... రెండో సెట్‌లో తన తొలి సర్వీస్‌ కోల్పోయిన సమయంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. 2021 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన మెద్వెదెవ్‌ ఈ మ్యాచ్‌ను 49 నిమిషాల్లోనే కోల్పోయాడు. గతంలో బెరెటినితో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఈ రష్యా ఆటగాడు... ఈసారి మాత్రం అదే జోరు కనబర్చలేకపోయాడు. 

ఇటీవల ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌పై విజయం సాధించిన మెద్వెదెవ్‌... మట్టి కోర్టులో జరిగిన ఈ పోరులో స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్‌ ప్రారంభమైనప్పటి నుంచి వరల్డ్‌ టాప్‌–10 ఆటగాడిని 6–0, 6–0తో ఓడించిన ఐదో ప్లేయర్‌గా బెరెటిని నిలిచాడు. దీన్ని ‘డబుల్‌ బేగల్‌’ అంటారు. చివరిసారిగా దశాబ్దం క్రితం ఇటాలియన్‌ ఓపెన్‌లో డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 6–0, 6–0తో బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తు చేశాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement