ఓట్ల తొలగింపుపై మమత పోరు
బీజేపీ, ఎన్నికల సంఘం బెంగాల్‌ను టార్గెట్ చేశాయి
బెంగాల్‌ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్రలు
ఎన్నికల ప్రచారంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం
కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)లో భాగంగా లక్షలాది ఓట్లు తొలగించడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. తాను మళ్లీ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్నట్లుగా ఉందని తెలిపారు. మమతా బెనర్జీ ఎల్‌ఎల్‌బీ అభ్యసించారు. ఫిబ్రవరి 4న సుప్రీంకోర్టులో వాదించారు. ఎస్‌ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. బుధవారం హుగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. బెంగాల్‌ను బీజేపీ, ఎన్నికల సంఘం టార్గెట్ చేశాయని, అందుకే ఓట్లు తొలగించారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టులో వాదించిన తొలి ముఖ్యమంత్రిని తానేనని వెల్లడించారు. ఓట్లు తొలగించినంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరని తేల్చిచెప్పారు. ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తొలగించిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చట్టపరంగా పోరాడుతామని ప్రకటించారు. ఎస్‌ఐఆర్ అంశం ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్‌లో ఉండగానే మొదటి దశ ఓటర్ల జాబితాను ఎలా ఖరారు చేశారంటూ ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేయలేని పరిస్థితి ఉంటే ఇక ట్రిబ్యునల్స్‌తో ప్రయోజనం ఏమిటని పేర్కొన్నారు. మళ్లీ న్యాయవాద వృత్తి చేపట్టాలని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి ఆ పని చేయలేనని వ్యాఖ్యానించారు.
బీజేపీ గెలుపు కోసం ఈసీ ఆరాటం
ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదార్లు తొక్కుతోందని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపు కోసమే ఎన్నికల సంఘం ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీకి పొరపాటున ఓటు వేస్తే చేపలు, మాంసం తినడం, బెంగాలీ భాష మాట్లాడడం మానుకోవాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను గుడ్లు, చేపలు, మాంసం తిననివ్వడం లేదని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే అదే పరిస్థితి బెంగాల్‌లోనూ వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో బెంగాల్‌ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. బెంగాల్‌ను విడదీసి మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆక్షేపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి గోదీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!
భవానీపూర్‌లో మమత నామినేషన్
సీఎం మమతా బెనర్జీ బుధవారం భవానీపూర్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాను భవానీపూర్‌లోనే పుట్టి పెరిగానని మమతా బెనర్జీ అన్నారు. తన జీవితం ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉందన్నారు. భవానీపూర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్


