‘పోడియంపై ఇక ఒంటరిని కాను’ | Comment by Indian star para archer Sheetal Devi | Sakshi
Sakshi News home page

‘పోడియంపై ఇక ఒంటరిని కాను’

Apr 10 2026 3:55 AM | Updated on Apr 10 2026 3:55 AM

Comment by Indian star para archer Sheetal Devi

భారత స్టార్‌ పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి వ్యాఖ్య 

కోల్‌కతా: వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో స్వర్ణ, రజతాలు భారత్‌కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్‌ పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్‌ దేవి... సహచర పారా ఆర్చర్‌ పాయల్‌ నాగ్‌ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. 

ఇటీవల బ్యాంకాక్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ కాంపౌండ్‌ మహిళల ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ శీతల్‌పై భారత్‌కే చెందిన 18 ఏళ్ల పాయల్‌ నాగ్‌ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్‌కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో శీతల్‌ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్‌ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. 

ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్‌ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్‌లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్‌కు చెందిన పాయల్‌ నాగ్‌... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. 

మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్‌ షాక్‌కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్‌గా ఎంచుకున్న పాయల్‌... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్‌పై గెలవడం పాయల్‌కు ఇది రెండోసారి. గతంలో నేషనల్‌ చాంపియన్‌షిప్‌లోనూ శీతల్‌పై పాయల్‌ పైచేయి సాధించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement