ఉన్నత చదువులు చదివితే కచ్చితంగా లక్షల ప్యాకేజ్‌లతో పనిచేసే ఉద్యోగాలు చేస్తుండటమో లేదా వ్యవస్థాపకులుగా కోట్లు గడించే రేంజ్‌లోనో ఉంటారు. అందులోనూ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్‌లన్నింటిలో ఆల్ ఇండియా టాపర్ సాధించిన వ్యక్తులు అంటే కచ్చింతంగా చాలా పెద్ద పొజిషన్‌లోనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వ్యక్తి అత్యంత విరుద్ధంగా ఆ మార్గాన్ని ఎంచుకుని ఆయన ఏం చేస్తున్నారో తెలిస్తే..విస్తుపోతారు. ఇలా ఎలా ఇంత పెద్ద అనుహ్య మార్గాన్ని ఎంచుకున్నారా అని ఆశ్చర్యపోతారు. పైగా అతడి కథ ఆలోచింపచేసేలా ఉండటమే గాక విజయానికి అసలైన అర్థం ఏంటో చాటి చెప్పారు.
ఆయనే శ్రీష్ జాదవ్. 1968లో జన్మించిన జాదవ్, చిన్న వయస్సు నుంచే విద్యలో అసాధారణ ప్రతిభ కనబరిచేవారు. 1985లో, భారతదేశంలోని అత్యంత పోటీతత్వ పరీక్షలలో ఒకటైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఐఐటీ జేఈఈ))లో ఆయన ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించారు. అలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IITK) చదువుకున్నారు. సోషియాలజీ మినహా అన్నింటిలోనూ 'A' గ్రేడ్‌లు సాధించి, అద్భుతమైన విద్యా ప్రతిభను కనబరిచారు. అతని పదునైన మేధస్సు, నిలకడైన ప్రతిభ అతన్ని తన కాలంలోని అత్యుత్తమ విద్యార్థులలో ఒకరిగా నిలబెట్టింది.
ఆ తర్వాత 1989లో కంప్యూటర్ సైన్స్‌లో గేట్ (GATE) పరీక్షలో 99.92 అద్భుతమైన పర్సంటైల్‌తో అగ్రస్థానంలో నిలిచారు. ఇక అక్కడితో చదువుని ఆపలేదు, పీహెచ్‌డీ కూడా చేశారు. ఆ తర్వాత సంప్రదాయ ఉద్యోగాలతో సంపాదన బాట పట్టకుండా సమాజ సేవ కోసం సర్వస్వం త్యాగం చేశారు. నిరుపేద విద్యార్థులకు విద్యనందించడం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన సమాజ సేవకు మించింది లేదనే భావంతో అరుణాచల్ ప్రదేశ్‌లోని నరోత్తమ్‌నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్ పాఠశాలలో రెసిడెంట్ గౌరవ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
ఆ తర్వాత 1996, 1997ల మధ్య రామకృష్ణ మిషన్ శిల్పమందిరంలో గౌరవ లెక్చరర్‌గా సేవలందించారు. అలాగే 1997-2006 వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ రంగంలో లెక్చరర్‌గా, కో ఆర్డినేటర్‌గా సేవలందించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత పెద్ద బాధ్యతలు స్వీకరించి, చివరికి రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి డీన్ ఆఫ్ రీసెర్చ్ మరియు కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆయన సమాజానికి చేసిన విశేష సేవలకు గానూ 2009లో ఆయనకు ఐఐటీ కాన్పూర్ 'విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం ప్రదానం చేసింది.
అంతేగాదు ఆయన సేవ మార్గాన్నే ఎంచుకున్నా.. విద్య పట్ల ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. కంప్యూటేషనల్ జ్యామితి, గ్రాఫ్ అల్గారిథమ్స్, డిస్క్రీట్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి వాటిలో పరిశోధనలు చేశారు. అంతేగాదు ఆయన బీటెక్ ప్రాజెక్టు ఓ ప్రముఖ కంప్యూటర్ సైన్స్ పరిశోధన సంస్థచే ప్రచురణ కోసం ఎంపిక అవ్వడం విశేషం. కాగా, శ్రీష్ జాదవ్ కథ నిజమైన విజయం సంపాదనలో లేదని, తెలివిగా ఎంచుకోవడంలోనే ఉందని చెబుతోంది. అంతేగాదు సక్సెస్ అంటే సంపద, గుర్తింపు కానే కాదని, ఒక లక్ష్యంతో స్పష్టతతో జీవించడం గురించని చెప్పకనే చెప్పారు శ్రీష్ జాదవ్.
(చదవండి: 'బుజ్జి' ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..)


