ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్‌ | Iran's Supreme National Security Council Claims "Historic Victory" | Sakshi
Sakshi News home page

ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్‌

Apr 8 2026 7:27 AM | Updated on Apr 8 2026 8:51 AM

Iran's Supreme National Security Council Claims "Historic Victory"

టెహ్రాన్‌: యుద్ధ లక్ష్యాల్లో తాము దాదాపు అన్నీ సాధించామని, తమది చారిత్రక విజయమని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓ ప్రకటన చేసింది.

"అమెరికాను మా 10 పాయింట్ల ప్రతిపాదనలను అంగీకరించేలా చేసి మేము చారిత్రక విజయం సాధించాం. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, ఎన్‌రిచ్‌మెంట్ హక్కులు, అన్ని ఆంక్షల తొలగింపునకు అంగీకరించింది. దాడులు నిలిపివేయడం, నష్టపరిహారం చెల్లించడం, పశ్చిమాసియా నుంచి బలగాలను వెనక్కి తీసుకెళ్లడం వంటివి అంగీకరించింది" అని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

నెల రోజులకుగా పైగా కాల్పుల విరమణకు అమెరికా ఒత్తిడి తెచ్చిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే, ఇరాన్ పలు సార్లు గడువులను తిరస్కరించిందని, దేశ లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపింది.

"ప్రారంభం నుంచే లక్ష్యాలు సాధించే వరకు యుద్ధం కొనసాగాలని నిర్ణయించాం. శత్రువు పశ్చాత్తాపపడేలా చేయడం, దేశానికి ఉన్న దీర్ఘకాల ముప్పును తొలగించేలా చేసుకోవడం కూడా ఇందులో ఉన్నాయి. అందువల్ల యుద్ధం ఇప్పటి వరకు 40వ రోజు వరకు కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు నిర్ణయించిన గడువులను ఇరాన్ పలుసార్లు తిరస్కరించింది. శత్రువు పెట్టే గడువులకు ప్రాధాన్యం ఇవ్వబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రజలకు శుభవార్త చెబుతున్నాం, యుద్ధ లక్ష్యాల్లో దాదాపు అన్నీ సాధించాం. శత్రువును శాశ్వత ఓటమి వైపు నెట్టాం" అని కౌన్సిల్ తెలిపింది.

కాగా, ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ స్పందిస్తూ.. శాశ్వత ఒప్పందం చర్చలకు 10 పాయింట్ల ప్రతిపాదన పునాది అవుతుందని, సైనిక లక్ష్యాల్లో ఎక్కువ భాగం సాధించామని తెలిపారు. 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు జరుపుతామని చెప్పారు.

ఇరాన్‌ 10 పాయింట్ల ప్రతిపాదన ఇదే..

  • పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా సమావేశం ఉండాలి

  • ఇరాన్‌పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి

  • హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ నియంత్రణ ఉండాలి

  • ఇరాన్‌పై అన్ని ఆంక్షలను ఎత్తివేయాలి

  • ఇరాన్‌కు యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి

  • అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలి

  • లెబనాన్‌సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ఆపాలి

  • యుద్ధాన్ని పూర్తిగా నిలివేయాలి

  • హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రత ఉండేలా ప్రోటోకాల్, షరతులు పెట్టడం

  • ఇరాన్ నిధులు, ఫ్రీజ్ చేసిన ఆస్తులు విడుదల చేయడం
     

Advertisement
 
Advertisement
Advertisement