నిఖత్‌కు నిరాశ | Nikhat Zareen won bronze after losing in the semis | Sakshi
Sakshi News home page

నిఖత్‌కు నిరాశ

Apr 7 2026 4:13 AM | Updated on Apr 7 2026 12:29 PM

Nikhat Zareen won bronze after losing in the semis

సెమీస్‌లో ఓడి కాంస్యం గెలిచిన భారత స్టార్‌  

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు), పూజా రాణి (85 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 

భారత్‌కే చెందిన ప్రీతి పవార్‌ (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), అరుంధతి (70 కేజీలు) సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో నిఖత్‌ 0–5తో వు యు (చైనా) చేతిలో  ఓడిపోయింది. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ వు యు చేతిలోనే నిఖత్‌ ఓటమి పాలైంది.

లవ్లీనా 0–5తో అజీజా జొకిరోవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో, అంకుశిత 0–3తో నియెన్‌ చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, పూజా రాణి 0–5తో నాదెజ్దా రియాబెట్స్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు. ఇతర సెమీఫైనల్స్‌లో ప్రీతి 5–0తో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఎజి ఇమ్‌ (దక్షిణ కొరియా)పై, అరుంధతి 4–1తో ఒయ్‌షా తొయ్‌రోవా (ఉజ్బెకిస్తాన్‌)పై, ప్రియ 5–0తో నమున్‌ మోన్‌ఖోర్‌ (మంగోలియా)పై గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement