తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..! | Travel Tips: Heritage Transport Museum Gurgaon Haryana | Sakshi
Sakshi News home page

తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!

Apr 6 2026 4:53 PM | Updated on Apr 6 2026 5:04 PM

Travel Tips: Heritage Transport Museum Gurgaon Haryana

మన దేశంలో తయారైన మొట్టమొదటి కారు ఎలా ఉంది.. అసలు మనిషి మొదటగా ఉపయోగించిన రవాణాసాధనం ఎలా ఉండేది.. ఎడ్ల బండి నుంచి ఏరోప్లేన్‌ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణాసాధనాలన్నింటినీ ఒకే చోట చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేయాలని.. ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వేసవిలో ‘హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ కు వెళ్లడం ఓ బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది.

ఢిల్లీ నుంచి సోహ్నా–గుర్‌గావ్‌ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా దాదాపు 63 కిలోమీటరు ప్రయాణిస్తే .... హర్యానా రాష్ట్రం, బిలాస్‌పూర్‌ చౌక్, టారు రోడ్‌లో ఉంది ఈ హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల ఇదే!

దాదాపు 90 వేల చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్‌ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియమ్, షాప్‌లు, రెస్టారెంట్‌ వసతులు కూడా ఉన్నాయి. 

రూపకర్త ఎవరు అంటే.. 
ఢిల్లీ నివాసి తరుణ్‌ థక్కర్‌కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. ఆసక్తి, ఉత్సాహం, శోధన నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్‌ థక్కిర్‌ విషయంలోనూ జరిగింది. గ్రామోఫోన్‌ల నుంచి టేబుల్‌ ల్యాంప్స్‌ వరకు రాజస్థాన్, గుజరాత్‌ చుట్టుపక్కల గ్రామాలు తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా 2013లో ఈ చారిత్రాత్మక వాహన శాల ఏర్పాటైంది. 

సినిమా సన్నివేశాలకు వీలుగా!
భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్‌ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో పాత కార్లనూ వీక్షించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్‌ పంపు, బాలీవుడ్‌ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్‌ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్‌కూడా ఏర్పాటు చేశారు.

బస్సుల పాత్ర ఎంతో..
మానవ ప్రగతికి బస్సు చక్రం ఎలా ఉపయోగపడిందో తెలియజెప్పవచ్చు. పెద్ద పెద్ద వాహనపరికరాలు గల బస్‌ డిపోతో పాటు, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... అందుకు సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీని సందర్శించవచ్చు. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. 
మేఘాలలో తేలిపోమ్మన్నది..

సైకిల్, స్కూటర్, మోటార్‌సైకిల్, మోపెడ్స్‌... ఒకనాడు సింగిల్‌గానూ, కపుల్‌గానూ ప్రయాణించిన ద్విచక్రవాహనాలు ఈ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. వీటితో పాటు చిన్నా, పెద్ద వాహనాలను పోలిన బొమ్మలూ ఇక్కడ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ ఈ మ్యూజియమ్‌లో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వీటిని చూస్తుంటే పెద్దవాళ్లు తమ చిన్ననాటి రోజుల జ్ఞాపకాల్లో వెళ్లకుండా ఉండలేరు.

ఆకాశయానం
ఎప్పటి నుంచి విమానమార్గంలో మన దేశస్తులు ప్రయాణించారు.. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందింది... దశలవారీగా తెలియజెప్పే విశేషాలన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. మన దేశ విమాయానపరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ ఒక చక్కని వేదిక. స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న విమానాన్నీ ఇక్కడ చూడవచ్చు.

రైలు.. టికెట్లు..
రైలు రవాణా మన దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది, నాటి నుంచి నేటి వరకు రైలు మార్గంలో, రైలు తయారీలో వచ్చిన మార్పులు. మొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటయ్యింది, ఎంత సమయం పట్టింది? వివరాలతోపాటు 1930ల నాటి రైల్వే స్టేషన్‌ ΄ఫ్లాట్‌ఫామ్‌ నమూనా, సెలూన్‌ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి రైలుబండి ఛాయా చిత్రాలు, ట్రెయిన్‌ టికెట్లు, రైల్వే సిగ్నల్స్, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు.

నీటిపైన తేలియాడే...
మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. 

భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఒకే దగ్గర తెలుసుకునే మహత్తర అవకాశంగా ఈ మ్యూజియమ్‌ను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమం ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ మన కళ్లకు కడుతుంది.

ఎక్కడ ఉందంటే...
బిలాస్‌పూర్‌ – తౌరు రోడ్, మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్‌ 132 ఆఫ్‌ ఎన్‌.హెచ్‌ 8, బిలాస్‌పూర్, చౌక్, తౌరు, హర్యానా

సందర్శన సమయం
ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు (సోమవారం సెలవు) 

టికెట్‌ ధర: 
పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.250, ఫొటోగ్రాఫ్స్‌ తీసుకునే సౌలభ్యం ఉంది. 

(చదవండి: 'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement