పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల వేళ ఇరాన్ సైతం కౌంటరిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం జరిగింది. 45 రోజులపాటు కాల్పుల విరమణకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు వంటి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. ట్రంప్ డెడ్‌లైన్ వేళ ఈ మేరకు ఓ ప్రముఖ అమెరికా పత్రిక తన కథనంలో పేర్కొంది.
అమెరికా పత్రిక తన కథనం మేరకు.. ఇరాన్‌కు ట్రంప్ విధించిన 48 గంటల గడువు నేపథ్యంలో యుద్ధం తీవ్రతరం కాకుండా నిరోధించడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే వంటి మధ్యవర్తిత్వ దేశాలకు చెందిన ప్రతినిధులు, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య సాధారణ(Text)మెసేజ్‌ల ద్వారా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మధ్యవర్తులు రెండు దశల కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారని అందులో స్పష్టం చేసింది. మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ ఉంటుందని, ఆ సమయంలో యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం చర్చలు జరుపుతారని చెప్పింది.
అలాగే, రెండో దశలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం ఉంటుందని తెలిపింది. ఈ తుది ఒప్పందం సమయంలో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియంను తొలగించడం వంటివి ఉంటాయని వివరించింది. కేవలం 45 రోజుల కాల్పుల విరమణ కోసం హార్మూజ్‌ను తెరవడం, యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించదని పేర్కొంది.
మరోవైపు.. ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి గడువును మరో 20 గంటలు (మంగళవారం రాత్రి) వరకు పొడిగించారు. అప్పటికీ ఒప్పందానికి రాకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ఇరాన్‌కు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరామానికి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతుండటం గమనార్హం.


