బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఐసీసీ లేఖ
డ్రెస్సింగ్‌రూమ్‌లో చిత్రీకరించిన వీడియోను మ్యాచ్ జరుగుతుండగానే విడుదల చేయడంపై అభ్యంతరం
ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఐసీసీ అభిప్రాయం
మ్యాచ్ ముగిసిన తర్వాతే వీడియో విడుదల చేయాల్సిందని సూచన
ఐసీసీ లేఖపై ఇప్పటివరకు స్పందించని ఈసీబీ
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేఖ రాసింది. మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన వీడియోపై వివరణ కోరింది. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియా (PMOA) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐసీసీ అభిప్రాయపడిందని సమాచారం.
గత నెల జూన్ 28న న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే స్టోక్స్ తన నిర్ణయాన్ని సహచర ఆటగాళ్లకు డ్రెస్సింగ్‌రూమ్‌లో వివరిస్తున్న వీడియోను మ్యాచ్ జరుగుతుండగానే టీ విరామానికి ముందు ఈసీబీ తమ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో, ప్రసార భాగస్వాములకు విడుదల చేసింది.
One of England's all-time greatest captains, Ben Stokes, has decided to retire from international cricket at the end of this Test match.
Ben, you have been the most inspirational captain, leader and legend this team could have ever hoped for.
We love you so much and wish you… pic.twitter.com/U5grq0F0kj— England Cricket (@englandcricket) June 28, 2026
ఈ అంశంపైనే ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. PMOA నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్‌రూమ్‌లలో కెమెరాలు లేదా ఇతర రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మ్యాచ్‌ల సమగ్రతను కాపాడడంతో పాటు ఐసీసీ అవినీతి నిరోధక నియమావళికి మద్దతుగా అమల్లో ఉన్నాయని పేర్కొంది.
ఐసీసీ అభిప్రాయం ప్రకారం, స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోను మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ 29న విడుదల చేసి ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆ దృశ్యాలను ప్రసారం చేయడంపైనే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశంపై ఐసీసీ పంపిన లేఖకు ఇప్పటివరకు ఈసీబీ అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉంటే, బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియను ఈసీబీ ప్రారంభించింది. వైట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ టెస్టు సారథ్యంపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 19 నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


