'సంజూకు అందుకే ఛాన్స్‌ ఇవ్వలేదు'.. మాజీ చీఫ్‌ సెలక్టర్‌ కీలక వ్యాఖ్యలు | MSK Prasad breaks silence on Sanju Samsons omission from Zimbabwe tour | Sakshi
Sakshi News home page

'సంజూకు అందుకే ఛాన్స్‌ ఇవ్వలేదు'.. మాజీ చీఫ్‌ సెలక్టర్‌ కీలక వ్యాఖ్యలు

Jul 9 2026 6:03 PM | Updated on Jul 9 2026 6:11 PM

MSK Prasad breaks silence on Sanju Samsons omission from Zimbabwe tour

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది.అయితే ఈ జ‌ట్టులో స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ పేరు లేక‌పోవ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేవ‌లం మూడు మ్యాచ్‌ల‌లో విఫ‌ల‌మైనంత మాత్రాన అత‌డిని జ‌ట్టు నుంచి చాలా మంది మాజీలు త‌ప్పుప‌డుతున్నారు. 

సంజూ ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుతో పాటు ఇంగ్లండ్‌లో ఉన్నాడు. తొలుత ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల‌లోనూ శాంస‌న్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టీ20లోనూ ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. దీంతో త‌ర్వాతి రెండు మ్యాచ్‌ల‌కు అత‌డిని ప‌క్క‌న పెట్టారు. 

ఇప్పుడు జింబాబ్వే టూర్‌కు పూర్తిగా జ‌ట్టు నుంచే ప‌క్క‌న పెట్టారు. సీనియ‌ర్ బ్యాట‌ర్లంద‌ర‌ని ఎంపిక చేసిన‌ప్ప‌టికి, ఒక్క సంజూనే జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డం ప‌లు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్ ఎంఎస్‌కే ప్ర‌సాద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తొలగించలేదని, కేవలం యువ ఆటగాళ్లను ప‌రీక్షించేందుకే అత‌డికి విశ్రాంతి ఇచ్చార‌ని ఎంఎస్‌కే అభిప్రాయ‌ప‌డ్డాడు.

"శాంస‌న్ విష‌యంలో అన‌వ‌స‌ర చ‌ర్చ‌లు వ‌ద్దు. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఆటగాడిని జ‌ట్టు ఇంత సులువుగా త‌ప్పిస్తారా?  ఫామ్ కార‌ణంగా అత‌డిని ప‌క్క‌న పెట్టార‌ని నేను అనుకోవ‌డం లేదు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సెలెక్టర్లు సంజూకు విశ్రాంతి ఇచ్చారని అనుకుంటున్నాను. 

జింబాబ్వే పర్యటనను ప్రధానంగా భారత బెంచ్ బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగ‌ప‌డుతోంది. అందుకే జ‌ట్టులో ఎక్కువ‌గా యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశ‌మిచ్చారు. ప్రపంచకప్ ముగిసిన మొదటి ఆరు నెలల కాలాన్ని సెల‌క్ట‌ర్లు  కొత్త ప్రయోగాల కోసమే కేటాయిస్తారు. తదుపరి ప్రపంచకప్ కోసం కేవ‌లం నుంచి 18 నెల‌ల ముందు మాత్ర‌మే సెలెక్టర్లు తమ కోర్ గ్రూప్ ఆట‌గాళ్లపై దృష్టి పెడతారు. 

కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న మార్పులను ప్రయోగాల్లో భాగంగానే చూడాలి. కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలమైనందున సంజూను జట్టు తప్పించారంటే నేను నమ్మను. ఆసియాగేమ్స్‌కు ఎంపిక చేసిన జట్టులో సంజూ ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. అయితే తదుపరి టీ20 ప్రపంచకప్‌(2028) ఆడాలంటే సంజూ కచ్చితంగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని" ఎంఎస్‌కే పేర్కొన్నాడు.
చదవండి: జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్‌ని చేస్తారేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement