IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్‌! | IND vs ENG 4th T20I: Sanju Samson Comeback In Playing XI 1 Condition | Sakshi
Sakshi News home page

IND vs ENG: తుదిజట్టులోకి సంజూ రావాల్సిందే.. కానీ ఓ కండిషన్‌!

Jul 9 2026 1:39 PM | Updated on Jul 9 2026 2:22 PM

IND vs ENG 4th T20I: Sanju Samson Comeback In Playing XI 1 Condition

PC: BCCI X

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే శ్రేయస్‌ అయ్యర్‌ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్‌ 3-0తో సొంతం చేసుకుంటుంది.

లెఫ్టాండర్లు ఎక్కువయ్యారు
ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్‌ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.

సంజూను కాదని వైభవ్‌కు అవకాశం
కాగా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించింది యాజమాన్యం.

రెండు మ్యాచ్‌లలోనూ విఫలం
ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్‌.. ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్‌ రాకతో టాపార్డర్‌ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్‌ శర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా లెఫ్లాండరే.

అదే విధంగా.. తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, శివం దూబే, అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

సంజూను ఆడించాల్సిందే
ఓపెనర్‌గా కాకపోయినా.. మిడిల్‌ ఆర్డర్‌లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్‌లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి
‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్‌ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.

లేదంటే ఆడించకపోవడమే మంచిది
అతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్‌-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్‌ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్‌లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్‌ నాయర్‌ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

ఓపెనర్‌గా ఇలా..
కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్‌-3  బ్యాటర్‌గా 36 ఇన్నింగ్స్‌ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఓపెనర్‌గా నాకౌట్‌ మ్యాచ్‌లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్‌-3లో 36 ఇన్నింగ్స్‌లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్‌రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.

మిడిలార్డర్‌లో అలా
మరోవైపు.. టాప్‌-3 బ్యాటర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్‌లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్‌ నాయర్‌ సంజూను ఓపెనర్‌గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. 

కాగా టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌ చేతిలో 2-0 వైట్‌వాష్‌ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్‌ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్‌ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. 

చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement