PC: BCCI
టీమిండియా ఆట తీరుపై ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పని లేదని.. సమస్యంతా లోయర్ ఆర్డర్‌లోనే ఉందన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో శివం దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం వారి వ్యూహాత్మక తప్పిదాలకు నిదర్శనమని విమర్శించాడు.
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా... తొలి టీ20 వర్షార్పణమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. తాజాగా మూడో టీ20లోనూ పరాజయం పాలైంది. నాటింగ్‌హామ్‌లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.
ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (10), వైభవ్ సూర్యవంశీ (13), వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.
ఇక ఐదో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మ (3) ఆరో స్థానంలో రాగా.. అక్షర్ పటేల్ (10) ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. హర్షిత్ రాణా (9) ఏడో స్థానానికి ప్రమోట్ అయి విఫలం కాగా.. ఎనిమిదో స్థానంలో వచ్చి శివం దూబే (2) ఫెయిల్ అయ్యాడు.
ఫలితంగా 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11.4 ఓవర్లలోనే కేవలం 76 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారత బ్యాటింగ్ ఆర్డర్‌లోనే సమస్య ఉంది. అక్షర్ పటేల్ మరీ ముందుగా వచ్చాడు. తిలక్ వర్మ లేటయ్యాడు. ఇక శివం.. అతడు కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆడతాడు. అందుకే ముందుగా బ్యాటింగ్‌కు రాకుండా దాక్కుండిపోయాడు.
నిజానికి జట్టు కోసం అతడు అన్నీ చేయాలి. కానీ స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రమే ఆడితే ఎలా?.. టీమిండియా ఓపెనర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. నిజానికి వాళ్లిద్దరు ఆడతున్న తీరు నాకు ముచ్చటగొలుపుతుంది.
ఒకవేళ అభిషేక్ ఆరు ఓవర్లు ఆడాడంటే.. అతడు అర్ధ శతకానికి చేరువకావడం ఖాయం. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి మనకు తెలిసిందే. అతడు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీకి మరిన్ని అవకాశాలు వస్తాయని.. అప్పుడు కూడా విఫలమైతే మాత్రం పరిస్థితి చేజారిపోతుందని అభిప్రాయపడ్డాడు.


