జట్టు నుంచి తప్పించడంపై గంభీర్ వివరణ
ఆటగాడి ఫామ్ కూడా ముఖ్యమన్న హెడ్ కోచ్
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో రెండో టి20 నుంచి సంజు సామ్సన్‌ను తప్పించడం తీవ్ర చర్చకు దారి తీసింది. టి20 ప్రపంచకప్‌లో వరుసగా 97, 89, 89 స్కోర్లతో భారత్‌ను గెలిపించడంతో పాటు సామ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. అయితే ఐర్లాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టి20లో అతను వరుసగా 5, 0, 1 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు. అయితే కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలం కావడంతోనే ఒక అగ్రశ్రేణి బ్యాటర్‌ను పక్కన పెట్టడంతో మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై మొదటిసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ఈ విషయంలో తాను స్వయంగా సామ్సన్‌కు అన్ని అంశాలు వివరించానని అతను వెల్లడించాడు. ‘సంజు సామ్సన్‌కు ఈ విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వాలో అదంతా చెప్పాం. ఇది ఒక ఆటగాడికి, హెడ్ కోచ్‌కు మధ్య జరిగిన సంభాషణ. కాబట్టి వాటి వివరాలు సహజంగానే మేం బయటకు చెప్పం. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రపంచ కప్‌లో సామ్సన్ ఎంత అద్భుతంగా ఆడాడో మాకూ బాగా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల తాజా ఫామ్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
అయినా ఈ సిరీస్‌లో అతను మళ్లీ ఆడలేడనే నిబంధన ఏమీ లేదు కదా. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్నింటికంటే ఫలితాలు ముఖ్యం. ఏ 11 మంది అత్యుత్తమ ఆటగాళ్ల బృందం మాకు ఫలితాలు అందిస్తుందనే నమ్ముతామో వారినే ఆడిస్తాం. భారత్ తరఫున ఆడగల హక్కును జట్టులోని ప్రతీ ఒక్కరు తమంతట తామే సంపాదించుకోవాలనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను’ అని గంభీర్ వివరించాడు. ఇంగ్లండ్‌తో మూడో టి20లో చిత్తుగా ఓడిన తర్వాత తమ పరాజయానికి కారణాలను కోచ్ విశ్లేషించాడు.
టి20ల్లో భారత జట్టు సుదీర్ఘ కాలంగా ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు జట్టు మారిందని, కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని హెడ్ కోచ్ అభిప్రాయ పడ్డాడు. ‘ఇంగ్లండ్‌లో పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సి అవసరం కచ్చితంగా ఉంది. అయితే ఇటీవల టీమ్‌లో పలు మార్పుచేర్పులు జరిగాయి. వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీమ్ నుంచి కొందరు మాత్రమే ఇక్కడున్నారు. కెప్టెన్ మారాడు, ఓపెనర్ మారాడు. పాండ్యా, బుమ్రా ఆడటం లేదు. కాబట్టి ఇంకా టీమ్ పూర్తిగా కుదురుకోలేదు.
జట్టులోకి పలువురు ఆటగాళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమయం పడుతుంది. మా ఆటగాళ్లంతా రిస్‌్కతో కూడిన క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఇలాంటి ఫలితాలూ వస్తాయి. ప్రపంచకప్‌లోనూ మా టాపార్డర్ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. అయితే అప్పుడు మిడిలార్డర్ నిలకడగా ఆడి ఆదుకుంది. ఈసారి అది కనిపించలేదు’ అని భారత మాజీ ప్లేయర్ వ్యాఖ్యానించాడు. నాలుగు మ్యాచ్‌లు ఓడినంత మాత్రం భారత్ చెత్త టీమ్‌గా మారిపోదని కూడా అతను అన్నాడు.


