అలాంటి వాళ్లకు ఈ లోకంలో స్థానం ఉండదు: కపిల్‌ దేవ్‌ | Kapil Dev Responds To Yograj Singh Controversial Remarks On Him | Sakshi
Sakshi News home page

అలాంటి వాళ్లకు ఈ లోకంలో స్థానం ఉండదు: కపిల్‌ దేవ్‌

Jul 9 2026 12:36 PM | Updated on Jul 9 2026 1:14 PM

Kapil Dev Responds To Yograj Singh Controversial Remarks On Him

టీమిండియా మాజీ క్రికెటర్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్లప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఆయనకు పరిపాటి. తన కెరీర్‌ను కపిల్‌ దేవ్‌ నాశనం చేశాడని.. తన కుమారుడు యువరాజ్‌ సింగ్‌ను మహేంద్ర సింగ్‌ ధోని తొక్కేశాడంటూ గతంలో ఎన్నోసార్లు యోగ్‌రాజ్‌ ఆరోపణలు చేశాడు.

కారణం లేకుండానే
ఇందులో భాగంగా టీమిండియాకు తొలి వరల్డ్‌కప్‌ అందించిన కపిల్‌ దేవ్‌ గురించి యోగ్‌రాజ్‌ గతంలో హద్దుమీరి వ్యాఖ్యలు చేశాడు. ‘‘ నార్త్‌ జోన్‌ (హర్యానా) నుంచి.. టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత కపిల్‌ దేవ్‌.. కారణం లేకుండానే నన్ను జట్టు నుంచి తప్పించాడు.

పిచ్చిపిచ్చిగా తిట్టేశాను
అప్పుడు నా భార్య (యువీ తల్లి) ఈ విషయం గురించి కపిల్‌తోనే నేరుగా మాట్లాడమని చెప్పింది. అప్పుడు నేను అతడికి కచ్చితంగా గుణపాఠం చెప్తా అన్నాను. సెక్టార్‌ 9లో ఉన్న కపిల్‌ దేవ్‌ ఇంటికి తుపాకితో వెళ్లాను. అప్పుడు తన తల్లితో కలిసి అతడు బయటకు వచ్చాడు.

అతడిని పిచ్చిపిచ్చిగా తిట్టేశాను. నీ కుళ్లుతో ఓ స్నేహితుడిని పోగొట్టుకున్నావు. అందుకు నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చివాట్లు పెట్టాను’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌ తెలిపాడు. ఈ క్రమంలో తండ్రికి బదులుగా యువరాజ్‌ సింగ్‌ కపిల్‌ దేవ్‌కు క్షమాపణలు చెప్పాడు.

అతడు గొప్ప క్రికెటర్‌
ఈ విషయాల గురించి స్పోర్ట్స్‌ టాక్‌ ఇంటర్వ్యూలో తాజాగా ప్రస్తావన రాగా.. కపిల్‌ దేవ్‌ ఎట్టకేలకు స్పందించాడు. యువీ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. దేశం కోసం ఆడాడు. తన స్థాయిలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కలిగించాడు. యువీ ఆట తీరుకు కోట్లలో అభిమానులు ఉన్నారు’’ అని కపిల్‌ దేవ్‌ కొనియాడాడు.

ఇక యోగ్‌రాజ్‌ సింగ్‌ వ్యాఖ్యల గురించి హోస్ట్‌ అడుగగా.. కపిల్‌ దేవ్‌ ఘాటుగానే స్పందించాడు. ‘‘అసలు అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇప్పటికీ అతడిని నా స్నేహితుడిగానే భావిస్తున్నాను. నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు.

పగ, అసూయతో రగిలిపోయే వ్యక్తి
అయినా ఎల్లప్పుడూ ఒకరిపై పగ, అసూయతో రగిలిపోయే వ్యక్తిని జీవితంలో నేనైతే మళ్లీ కలవను. సంతోషంగా, సానుకూల దృక్పథం ఉన్నవాళ్లతో మాత్రమే మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. కొన్నిసార్లు గతాన్ని మరిచి ముందుకు సాగాల్సి ఉంటుంది.

అలా కాకుండా గతాన్నే పట్టుకుని వేలాడుతూ ఇతరులను నిందిస్తూ ఉంటే.. ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడరు. అతడి కొడుకు యువీ గొప్ప ఆటగాడు. ఆటతోనే అందరి మనసులు గెలుచుకుని సంతోషకరమైన జీవితం గడుపుతున్నాడు.

అలాంటి వాళ్లకు ఈ లోకంలో స్థానం ఉండదు
నిజానికి జీవితంలో అందరికి అన్నీ దొరకవు. కొన్ని కోరికలు మన కుటుంబ సభ్యుల ద్వారా కూడా నెరవేరుతాయి. అతడి కొడుకు అతడి కలను పరిపూర్ణం చేశాడు. అయినా ఇంకా ఏదో అసంతృప్తి. అసలు ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులకు ఈ లోకంలో ఎలాంటి స్థానమూ ఉండదు.

జీవితాంతం అసంతృప్తితోనే 
ఒకరిని తిట్టడం వల్ల మీరేమీ గొప్పవాళ్లు అయిపోరు. ఎదుటివారి స్థాయినీ తగ్గించలేరు. ప్రతి ఒక్కరి కెరీర్‌, జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. దానికి ఇతరులపై నిందించడం సరికాదు. ఎన్ని దొరికినా ఇంకా అసంతృప్తి ఉందంటే.. ఎల్లకాలం అసంతృప్తితోనే బతకాల్సి వస్తుంది.

అతడు నాకు చిన్ననాటి స్నేహితుడు. మేము కలిసే పెరిగాము. కానీ అతడు చేదు జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుని.. మంచిని మరిచిపోయాడు’’ అని కపిల్‌ దేవ్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌కు చురకలు అంటించాడు. కాగా యువీ తల్లితో విడాకులు తీసుకున్న యోగ్‌రాజ్‌.. తర్వాత పంజాబీ నటిని పెళ్లాడాడు. వీరికి ఇ‍ద్దరు సంతానం. ఇక యువీకి కూడా ఓ తోబుట్టువు ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement