విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన సౌతాఫ్రికా చిచ్చరపిడుగు | Lhuan dre Pretorius hits his first T20 Hundred in MLC 2026 | Sakshi
Sakshi News home page

విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన సౌతాఫ్రికా చిచ్చరపిడుగు

Jul 9 2026 10:53 AM | Updated on Jul 9 2026 11:03 AM

Lhuan dre Pretorius hits his first T20 Hundred in MLC 2026

మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2026లో సౌతాఫ్రికా చిచ్చరపిడుగు, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్  ఓపెనర్ లుహాన్-డ్రే ప్రిటోరియస్ అద్భుత సెంచరీతో ఇరగదీశాడు. ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో అరువు తీసుకున్న బ్యాట్‌తో బరిలోకి దిగి, కేవలం 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 102 పరుగులు చేసి తన కెరీర్‌లో తొలి టీ20 శతకాన్ని నమోదు చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో యూనికార్న్స్ 9 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 21 బంతుల్లో 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సన్నీ పటేల్ 32 పరుగులతో పోరాడాడు. మ్యాట్ షార్ట్ తన ఆఫ్‌స్పిన్‌తో ప్రత్యర్థి టాపార్డర్‌ను దెబ్బతీశాడు. అతడు 3 వికెట్లు పడగొట్టగా, ఆరోన్ హార్డీ రెండు వికెట్లు తీశాడు. 

144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూనికార్న్స్‌కు ప్రిటోరియస్ మెరుపు ఆరంభం ఇచ్చాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఎదురుదాడి ప్రారంభించాడు. అనంతరం మరోసారి బౌల్ట్‌పై వరుసగా మూడు ఫోర్లు బాదుతూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

ప్రిటోరియస్ ఇన్నింగ్స్‌లో మరో విశేషం కూడా ఉంది. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ, తన ఓపెనింగ్ భాగస్వామి ఫిన్ అలెన్ బ్యాట్‌ను అరువు తీసుకుని ఆడినట్లు వెల్లడించాడు. అదే బ్యాట్‌తో తన తొలి టీ20 సెంచరీ సాధించడం విశేషంగా మారింది.

ప్రిటోరియస్ అద్భుత బ్యాటింగ్‌తో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ సెంచరీతో ప్రిటోరియస్ ఎంఎల్‌సీ 2026లో తన అద్భుత ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. టోర్నీ మొత్తం మీద నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా అవతరించాడు. ఈ టోర్నీలో అతడు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 182.02 స్ట్రయిక్‌రేట్‌తో ఓ సెంచరీ, 4 అర్ద సెంచరీల సాయంతో 415 పరుగులు చేశాడు.

 

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement