టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా తన సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2027 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాప్‌లో యువీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జే.ఎస్.డబ్ల్యూ సంస్థ తిరిగి రెండేళ్లపాటు నిర్వర్తించనుంది.
ఈ క్రమంలో ఢిల్లీ కోచింగ్ స్టాప్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఇండియా కథనం ప్రకారం.. జే.ఎస్.డబ్ల్యూ క్రికెట్ జట్ల డైరెక్టర్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ పురుషుల జట్టు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
గంగూలీ నేతృత్వంలో యువరాజ్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.
"యువరాజ్ సింగ్ వంటి లెజెండరీ ప్లేయర్ కోచింగ్ స్టాప్‌లో ఉండాలని ప్రతీ టీమ్ కోరుకుంటుంది. ఇప్పటికే ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ , వీరేంద్ర సెహ్వాగ్ వంటి అతని మాజీ సహచరులు చాలామంది ఇప్పటికే కోచింగ్ బాధ్యతలు చేపట్టారు.
ఈ విషయంలో యువరాజ్ కాస్త ఆలస్యంగా అడుగుపెడుతున్నప్పటికీ, యువ ఆటగాళ్లతో పని చేయడం, ఆధునిక క్రికెట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. అతడు కేవలం ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారికి ఒక మెంటార్‌గా దిశానిర్దేశం చేస్తాడు.
ఫోన్ కాల్స్ లేదా వర్చువల్ సెషన్లకే పరిమితం కాకుండా ఆటగాళ్లతో పాటు అతడు కూడా మైదానంలో గంటల తరబడి గడుపుతాడు. అతడు ఇప్పటికే చాలా మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు" అని ఢిల్లీ క్యాపిటిల్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య వంటి యువ ఆటగాళ్లు యువీ గైడెన్స్‌లో రాటుదేలిన వారే. కాగా గంగూలీ కెప్టెన్సీలోనే యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడు అదే గురుశిష్యుల జోడీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను తొలి ఐపీఎల్ టైటిల్ వైపు నడిపించడానికి వ్యూహాలు రచించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత హెడ్‌కోచ్‌గా హేమంగ్ బదోని ఉన్నాడు.


