తెలంగాణ ఒలింపిక్‌ భవనాన్ని ప్రారంభించిన పీటీ ఉష | PT Usha Inaugurates Telangana Olympic Bhavan In Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఒలింపిక్‌ భవనాన్ని ప్రారంభించిన పీటీ ఉష

Jul 9 2026 1:58 PM | Updated on Jul 9 2026 2:38 PM

PT Usha Inaugurates Telangana Olympic Bhavan In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షురాలు పి.టి. ఉష మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ భవనం కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, భావితర క్రీడాకారుల కలలను సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవనుంది.

తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పదాధికారులకు.. అదే విధంగా ఈ భవన నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.

ఒలింపిక్ ఉద్యమం విజయవంతం కావాలంటే పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయబద్ధత వంటి విలువలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. క్రీడాకారుల ప్రయోజనాలే మనందరి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. వారికి అత్యుత్తమ శిక్షణ, సదుపాయాలు, ప్రోత్సాహం అందేలా ప్రతి సంస్థ కృషి చేయాలి.

మన దేశ క్రీడాకారుల విజయాల వెనుక నిలిచే కోచ్‌లు, సాంకేతిక నిపుణులు, అధికారులు, వాలంటీర్లు మరియు నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. యువ క్రీడాకారులకు నా సందేశం ఒక్కటే – మీపై మీరు నమ్మకం ఉంచండి. క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో ముందుకు సాగండి. ప్రతి ఛాంపియన్ ప్రయాణం ఒక కలతో ప్రారంభమవుతుంది. ఆ కలను నిజం చేసుకునే వరకు ప్రయత్నాన్ని ఆపవద్దు.

ఈ తెలంగాణ ఒలింపిక్ భవన్ భావితర క్రీడాకారులకు ప్రేరణనిచ్చే కేంద్రంగా, క్రీడా సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే వేదికగా, దేశానికి మరెన్నో అంతర్జాతీయ పతక విజేతలను అందించే స్ఫూర్తి నిలయంగా మారాలి’’ అని ఆకాంక్షించారు.

ఇక మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘పరిగెత్తడంలో మిల్కా సింగ్ ఆ తర్వాత ఉష భారతదేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. నాడు భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మెడల్స్ సాధించారు. అయితే, ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్న పతకాలు సాధించడంలో ఇపుడు యువత మాత్రం వెనుకబడిపోయారు.

క్రీడల్లో మనం ఎందుకు ముందుకు పోవడం లేదు యువత ఆలోచన చేయాలి. గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ తగ్గి సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత ఎక్కువ సమయం ఇస్తున్నారు. ఆటల కోసం బతకాలి. గేమ్ ను జీవితముగా ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. 

జనాభాలో పెద్ద దేశం అయినప్పటికీ ఆటలపై దృష్టి సాధించడం లేదు. చిన్న చిన్న దేశాలు మెడల్స్ సాధిస్తున్నాయి. దేశం కోసం ఆడండి..ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకు రండి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి’’ అని యువతకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement