సారీ.. సిబ్బంది లేరు స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండి
ఇదీ గూడూరు పోలీసుల తీరు
నెల్లూరు జిల్లా: ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టి అరెస్ట్ చేసేందుకు ఒంటి కాలిపై పరుగులెత్తే పోలీసులు శాంతిభద్రలను కాపాడడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రజల ఆస్తులను దొంగిలించేందుకు వచ్చిన దొంగను పట్టుకుని పోలీసులకు ఫోన్ చేసి ‘దొంగను పట్టుకున్నాం.. తీసుకెళ్లండి’ అంటే.. సారీ.. మా స్టేషన్‌లో సిబ్బంది లేరు స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండి అంటూ తాపీగా సమాధానం ఇచ్చారు.
ఈ ఘటన గూడూరు పట్టణంలో బుధవారం వేకువ జామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ నడి»ొడ్డులోని చర్చి కాంపౌండ్‌లో ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా యజమానికి మెలుకువ వచ్చి అతన్ని పట్టుకుని నిలదీస్తే అతను గంజాయి మత్తులో ఉన్నాడు. దీంతో చుట్టు పక్కల నివాసాల్లోని వారు చేరుకుని అతని నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హిందీలో మాట్లాడుతూ హల్‌చల్ చేయడంతో స్థానికులు 100కు డయల్ చేశారు.
కంట్రోల్ రూమ్ నుంచి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో వారు అరగంట తరువాత ఫోన్ చేసి ఏమి జరిగిందనే విషయం అడిగి తెలుసుకున్నారు. అపరిచిత వ్యక్తిని పట్టుకున్నాం, మీరు వచ్చి తీసుకుని వెళ్లండని పోలీసులకు తెలియజేస్తే స్టేషన్లో సిబ్బంది లేరు, అందరూ బందోబస్తుకు వెళ్లి ఉన్నారు. కాబట్టి మీరే అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండని చెప్పారు. దీంతో అపరిచిత వ్యక్తిని చర్చి కాంపౌండ్ వాసులు బజారులో వదలి వేశారు. ఇలా అపరిచితులు ఇష్టానుసారంగా పట్టణంలో సంచరిస్తుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


