సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్‌డెత్‌లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్‌తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.


