6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు! | Rajasthan beauty parlor owner beaten with slippers 43 times in 6 minutes | Sakshi
Sakshi News home page

బ్యూటీ పార్ల‌ర్ యజ‌మానిని చిత‌క‌బాదిన యువ‌తులు

Jul 9 2026 2:24 PM | Updated on Jul 9 2026 2:48 PM

Rajasthan beauty parlor owner beaten with slippers 43 times in 6 minutes

తాను చేస్తున్న వెద‌వ ప‌నిని ఎవ‌రూ చూడ‌డం లేద‌నుకుని రెచ్చిపోయాడో బ్యూటీ పార్ల‌ర్ యజ‌మాని. అత‌డి  కుటిల ప‌న్నాగాన్ని సీక్రెట్ కెమెరా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. దీంతో మ‌నోడు క‌ట్టుక‌థతో క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా చెప్పు దెబ్బ‌ల‌తో బుద్ధిచెప్పారు బాధిత మ‌హిళ‌లు. 6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు కొట్టి చాకిరేవు పెట్టేశారు. అత‌డిపై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌లోని చూరూ జిల్లాలోని సాదుల్‌పూర్ ప్రాంతంలో ఉన్న‌ ఓ బ్యూటీ పార్లర్‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అస‌లేం జ‌రిగింది?
బ్యూటీ పార్లర్‌లోని తాగేనీటిలో య‌జ‌మాని భవానీ శంకర్ ఖత్రి ఏదో క‌లుపుతున్నట్టు రహస్య కెమెరా ద్వారా గుర్తించిన న‌లుగురు మహిళా ఉద్యోగులు అత‌డిని చెప్పుల‌తో ఎడాపెడా వాయించేశారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డ‌య్యాయి. జూన్ 29న ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దురుద్దేశంతోనే తాగునీటిలో మత్తు పదార్థం క‌లిపేందుకు అత‌డు ప్ర‌య‌త్నించాడ‌ని వారు ఆరోపించారు. ఈ మేర‌కు రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తాగునీటిలో భవానీ శంకర్ ఏదో కలుపుతున్నాడనే అనుమానం జూన్ 27నే తాము క‌నిపెట్టామ‌ని, అత‌డిని ఆధారాల‌తో ప‌ట్టించాల‌నే ర‌హ‌స్య కెమెరా పెట్టామ‌ని బాధిత యువ‌తులు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా అత‌డి వ్య‌వ‌హారశైలిలో మార్పు వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. గ‌తంలో బ్యూటీపార్ల‌ర్ జ‌మాఖ‌ర్చులు చూసుకోవ‌డానికి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే వ‌చ్చేవాడ‌ని, కొన్ని రోజుల నుంచి త‌ర‌చుగా రావ‌డం చేస్తున్నాడ‌ని తెలిపారు. తాగే నీటిలో మ‌త్తు మందు క‌లుపుతున్నాడ‌నే అనుమానం రావ‌డంతో ఫోన్‌లో ర‌హ‌స్యంగా వీడియో తీయడంతో దొరికిపోయాడ‌ని వివ‌రించారు.

పోలీసులు ఏమ‌న్నారు?
భవానీ శంకర్ అనుమానాస్ప‌ద వ్య‌వ‌హారంపై యువతుల నుంచి త‌మ‌కు ఫిర్యాదు అందిందని రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేష్ సిహాగ్ మీడియాకు తెలిపారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. భవానీ శంకర్ నిజంగా మ‌త్తు మందు క‌లిపాడా, లేదా అనేది విచార‌ణ‌లో తేలుతుంద‌ని చెప్పారు.

చ‌ద‌వండి: రైలు బోగీనే హ‌నిమూన్ సూట్‌!

'మ‌త్తు మందు కాదు ఆవాలు'
త‌న‌పై న‌లుగురు యువ‌త‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌ను భవానీ శంకర్ ఖత్రి తోసిపుచ్చాడు. కొంతకాలంగా తన పార్లర్ వ్యాపారం సరిగా న‌డ‌వ‌డం లేద‌ని, అందుకే ప‌సుపు క‌లిపిన ఆవాలు పార్లర్‌లో ఉంచాన‌ని చెప్పుకొచ్చాడు. అలాగే తాగే నీటిలో తాను క‌లిపింది గంగాజ‌లం అని, అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా మత్తు పదార్థం కాద‌ని చెప్పాడు. అత‌డు చెప్పింది వాస్త‌మో, కాదో పోలీసులే తేల్చాలి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement