బెంగళూరు: ఓ భర్త తన భార్యను హెల్మెట్‌తో కొట్టి దారుణంగా కడతేర్చిన ఘటన హుబ్లీ సమీపంలోని తారిహళ గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. నాలుగున్నర నెలల క్రితమే వీరికి వివాహం కావడం గమనార్హం. మృతురాలిని నాగరత్న హొళెమని(24)గా గుర్తించారు. నిందితుడైన భర్తను తారిహాళ గ్రామ గణేష్ నగర్ నివాసి శివరాజ్ హొళెమని(28)గా గుర్తించారు. పెళ్లి అయ్యాక ఈ యువ దంపతుల మధ్య తరచు కలతలు, కలహాలు నెలకొనేవి. నాగరత్న పదే పదే పుట్టింటికి వెళుతుండేది. బుధవారం ఉదయమే నాగరత్న పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చింది.
ఉదయం మాటామాటా పెంచుకొని పరిస్థితి ప్రకోపానికి దారి తీయడంతో ఆగ్రహానికి గురైన శివరాజ్ హెల్మెట్‌తో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరత్న స్థలంలోనే మృతి చెందిందని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా పరారీలో ఉన్న నిందితుడు శివరాజ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతానికి హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


