ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో శతక్కొట్టిన కెప్టెన్‌ | TG20 League Eliminator: Tanmay Century Karimnagar Huge Score Vs RRR | Sakshi
Sakshi News home page

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో శతక్కొట్టిన కెప్టెన్‌.. కరీంనగర్‌ భారీ స్కోరు

Jul 9 2026 3:48 PM | Updated on Jul 9 2026 4:20 PM

TG20 League Eliminator: Tanmay Century Karimnagar Huge Score Vs RRR

తన్మయ్‌ అగర్వాల్‌ (PC: TG20 X)

రంగారెడ్డి రైజర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌ కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ దంచికొట్టాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో అదరగొట్టాడు. కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో ఏకంగా 137 పరుగులు రాబట్టాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్‌-2026లో తన్మయ్‌కు ఇది మూడో సెంచరీ. 

సింహా అర్ధ శతకం
ఇక రంగారెడ్డితో మ్యాచ్‌లో ఓపెనర్లలో తన్మయ్‌ ఇలా సెంచరీతో చెలరేగగా.. సాత్విక్‌ రెడ్డి మాత్రం 15 పరుగులకే నిష్క్రమించాడు. అయితే, తన్మయ్‌తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ హెచ్‌కే సింహా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 28 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది సింహా అర్ధ శతకం (50) పూర్తి చేసుకుని అవుటయ్యాడు. 

తన్మయ్‌, సింహా కలిసి రెండో వికెట్‌కు 69 బంతుల్లో ఏకంగా 139 పరుగులు జోడించారు. ఇక వీరిద్దరు అవుటైన తర్వాత కరీంనగర్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. వైస్‌ కెప్టెన్‌ చందన్‌ సహానీ 3, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రాహుల్‌ రాదేశ్‌ 14 పరుగులు చేసి అవుట్‌ కాగా.. నారాయణ తేజ డకౌట్‌గా వెనుదిరిగాడు.

కరీంనగర్‌ భారీ స్కోరు
మిగిలిన వారిలో హరీశ్‌ ఠాకూర్‌ 9 పరుగులు చేయగా.. శుభం శర్మ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సరికి కరీంనగర్‌ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది.

రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్‌ కరియప్ప రెండు వికెట్లు తీయగా.. అరుణ్‌ కుమార్‌, కెప్టెన్‌ తనయ్‌ త్యాగరాజన్‌, సచేత్‌, నితిన్‌ సాయి యాదవ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement