కరీంనగర్‌ ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు! | TG20 League 2026 Karimnagar Beat Palamuru Enters Play Offs | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు!

Jul 7 2026 6:39 PM | Updated on Jul 7 2026 7:15 PM

TG20 League 2026 Karimnagar Beat Palamuru Enters Play Offs

PC: KAD

తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌ అరంగేట్ర సీజన్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. పాలమూరు స్ట్రైకర్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కరీంనగర్‌ ఆటగాళ్లు దుమ్ములేపారు. ఈ క్రమంలో ప్రత్యర్థిని ఏకంగా 73 పరుగుల తేడాతో చిత్తు చేసింది కరీంనగర్‌.

ఉప్పల్‌ వేదికగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో పాలమూరు- కరీంనగర్‌ తలపడ్డాయి. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.

తన్మయ్‌ అగర్వాల్‌ అద్భుత శతకం 
ఓపెనర్లలో కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ అద్భుత శతకం (58 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు; 109) సాధించాడు. సాత్విక్‌ రెడ్డి 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో నారాయణ తేజ మెరుపులు (8 బంతుల్లో 23 నాటౌట్‌) మెరిపించాడు.

ఇక లక్ష్య ఛేదనలో పాలమూరును కరీంనగర్‌ 143 పరుగులకే కట్టడి చేసింది. కరీంనగర్‌ బౌలర్లలో రత్లావత్‌ దినేశ్‌, శుభం శర్మ మూడేసి వికెట్లతో చెలరేగి పాలమూరు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. నారాయణ తేజ, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

సంహిత్‌ రెడ్డి మెరుపులు వృథా
పాలమూరు బ్యాటర్లలో సంహిత్‌ రెడ్డి టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా షాదాబ్‌ అహ్మద్‌ (16 బంతుల్లో 24) రాణించాడు. కానీ మిగతా వాళ్లంతా తేలిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాలమూరు తొమ్మిది వికెట్లు నష్టపోయి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో ఓటమితోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

కాగా లీగ్‌ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో పాలమూరుకు ఇది ఐదో ఓటమి. మరోవైపు.. కరీంనగర్‌కు ఏడింట ఇది నాలుగో గెలుపు. ఇక ఇప్పటికే హైదరాబాద్‌, ఖమ్మం ప్లే ఆఫ్స్‌ చేరగా.. మూడు, నాలుగు స్థానాల కోసం కరీంనగర్‌, నల్గొండ, రంగారెడ్డి బరిలో నిలిచాయి. 

అయితే, మంగళవారం జరిగే రంగారెడ్డి- వరంగల్‌ మ్యాచ్‌ ఫలితంతో మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు నిలిచారో అధికారికంగా తేలుతుంది. కరీంనగర్‌ ఎనిమిది పాయింట్లతో పాటు మెరుగైన నెట్‌రన్‌రేటు (+1.424)తో బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement