సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు నాలుగు పతకాలతో మెరిశాడు. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో గౌతమ్ 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ (25.47 సెకన్లు), 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ (31.18 సెకన్లు) విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 50 మీటర్ల ఫ్రీస్టయిల్ (24.80 సెకన్లు) ఈవెంట్‌లో, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ (58.40 సెకన్లు) ఈవెంట్‌లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు.
గౌతమ్ ప్రస్తుతం విక్కీ స్విమ్మింగ్ అకాడమీలో హెడ్ కోచ్ శివేందర్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకే చెందిన టీఎస్ తేజస్ (100, 200 మీటర్ల ఫ్రీస్టయిల్), మెరుపుల లిఖిత గౌడ్ (800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్) రెండు బంగారు పతకాల చొప్పున సాధించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన జోనా షిజు బాలికల 200, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో పసిడి పతకాలు దక్కించుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి 472 పాయింట్లతో ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.


