తాష్కెంట్: ఆసియా అండర్-17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 17 పతకాలతో అదరగొట్టారు. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత బాలికలు 12 పతకాలు సాధించగా... భారత బాలురు 5 పతకాలు సొంతం చేసుకున్నారు. బాలికల కేటగిరీలో రాఖీ (46 కేజీలు), నవ్య (57 కేజీలు) స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.
ఖుషీచంద్ (48 కేజీలు), దివ్య (63 కేజీలు), హిమాన్షి (70 కేజీలు), జ్యోతి (75 కేజీలు), వన్షిక (80 కేజీలు), గుర్‌సీరత్ కౌర్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. మమత (52 కేజీలు), లక్ష్మీ మంజునాథ్ (54 కేజీలు), ఇషిక (60 కేజీలు), హర్నూర్ కౌర్ (66 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు పొందారు.
బాలుర కేటగిరీ 75 కేజీల ఫైనల్లో లక్షయ్ ఫొగాట్ 0:5తో తొష్‌పులతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. నేళ్ల నరేంద్ర కుమార్ (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ కుమార్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలను సంపాదించారు.


