‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ‌!’ | Thomas Cup Hero-Satwik Sairaj-Heartbroken By Lack Of Support | Sakshi
Sakshi News home page

‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ‌’.. తెలుగు ప్లేయర్‌ ఆవేదన!

May 6 2026 6:14 PM | Updated on May 6 2026 7:01 PM

Thomas Cup Hero-Satwik Sairaj-Heartbroken By Lack Of Support

భారత డబుల్స్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌

బ్యాడ్మింట‌న్‌లో థామ‌స్ క‌ప్‌కు ఉండే ప్ర‌త్యేకత వేరు. చైనా, మ‌లేషియా, జ‌పాన్ లాంటి దేశాల్లో బ్యాడ్మింట‌న్ ఆట‌కు ఉన్న క్రేజ్ కూడా వేరు. భారత్‌లోనూ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, ల‌క్ష్య‌సేన్‌, కిడాంబి శ్రీకాంత్‌, డ‌బుల్స్ జోడి చిరాగ్‌-సాత్విక్ జోడి బ్యాడ్మింటన్‌లో అంచ‌నాలు అందుకుంటూ ప‌త‌కాలు సాధించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. 

అయినా కూడా భార‌త్‌లో క్రికెట్‌ను మిన‌హాయించి ఏ క్రీడ‌ను అంత‌గా ప‌ట్టించుకోరన్న‌ది చాలాసార్లు రుజువైంది. తాజాగా జ‌ర్మ‌నీ వేదిక‌గా జ‌రిగిన థామ‌స్ క‌ప్‌లో భార‌త పురుషుల బృందం కాంస్య ప‌త‌కం గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే థామస్ క‌ప్‌లో ప‌త‌కం సాధించి భార‌త్‌కు తిరిగి వ‌స్తే త‌మ‌ను క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేదంటూ భార‌త ఆట‌గాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

జ‌ర్మ‌నీ ఎయిర్‌పోర్టులో భారతీయులు ఉన్నా కూడా త‌మ ద‌గ్గ‌ర‌కు రాలేద‌ని, ఇక భార‌త్‌లో అయితే క‌నీసం త‌మ ముఖాలు కూడా చూడ‌లేద‌ని డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ బాధ‌ను వ్య‌క్తం చేశాడు. దేశానికి ప‌త‌కాలు సాధించినా త‌మ‌కు త‌గిన గుర్తింపు లేక‌పోవ‌డం ష‌ట్ల‌ర్లుగా త‌మ‌కు నిరాశ క‌లిగించింద‌న్నాడు. ఇలాంటి అవ‌మానాల‌తో భార‌త్‌లో బ్యాడ్మింట‌న్ వంటి క్రీడ‌ను వృత్తి ప‌రంగా  కొన‌సాగించాలా వ‌ద్దా అనేది ఆలోచించుకునే ప‌రిస్థితిలో ఉన్న‌ట్లు తెలిపాడు. 

సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ.. ‘జ‌ర్మ‌నీ నుంచి ఏడు గంట‌ల పాటు విమాన ప్ర‌యాణం చేసి హైద‌రాబాద్ చేరుకున్నాం. మేము జ‌ర్మ‌నీ ఎయిర్‌పోర్టులో ఉన్న‌ప్పుడు మా కాంస్య‌ ప‌త‌కాలు చూసిన కొంద‌రు.. ఎవ‌రు మీరు, ఎక్క‌డి నుంచి వ‌చ్చారు అని అడ‌గ‌లేదు. అందులో భార‌తీయుల‌తో పాటు చాలా మంది తెలుగువాళ్లు కూడా ఉన్నారు. 

మేమంతా థామ‌స్ క‌ప్ జెర్సీలు ధ‌రించి ఉన్న‌ప్ప‌టికీ, వాళ్లంతా ఐపీఎల్‌, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. 2022లో ఇదే థామ‌స్ క‌ప్‌లో స్వ‌ర్ణం సాదించిన‌ప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘ‌న‌తలు సాధించిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకోవాలి. ఇలాంటి అవ‌కాశాలు త‌ర‌చూ రావ‌ని మ‌న అభిమానుల‌కు తెలియ‌డం లేదు. థామ‌స్ క‌ప్ గెల‌వ‌డం చాలా క‌ష్టం, ప‌త‌కాలు సాధించ‌డం కూడా క‌ష్ట‌త‌రం. ఎయిర్‌పోర్టులో దిగిన త‌ర్వాత ప్ర‌ణ‌య్‌, శ్రీకాంత్‌, ధ్రువ్ క్యాబ్‌లు బుక్ చేసుకోవ‌డం చూశాను. 

అభినందించ‌డానికి ఒక్క‌రు కూడా మా ద‌గ్గ‌రికి రాలేదు. నా స్నేహితులు న‌న్ను పిక్ చేసుకునేందుకు వ‌చ్చారు. కానీ ఎయిర్‌పోర్ట్‌లో నా స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు క్యాబ్‌లు బుక్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగించ‌డం బాధ‌గా అనిపించింది. టోర్నీల్లో బరిలోకి దిగి గాయపడితే.. మన బదులు ఆడేందుకు ఎవరూ ఉండరు. టీమ్ ఈవెంట్స్‌లోనూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. 

బయట నుంచి పెద్దగా సపోర్ట్ లేకుండా ఆడతాం. పతకాలు గెలిచినా సరిపోవడం లేదు. ఓ సందర్భంలో ప్రణయ్‌తో.. 'ఈ క్రీడకు ఎలాంటి గుర్తింపులేదు. నేను నా పిల్లలను బ్యాడ్మింటన్ వైపు రానివ్వను' అని చెప్పా. మానసికంగా దృఢంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే మనం ఎంత ప్రదర్శన చేసినా గుర్తించకపోతే చాలా బాధేస్తుంది. హైదరాబాద్ అకాడమీలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం వరకే ఆశిస్తున్నాం’అని సాత్విక్ బాధాతప్త హృదయంతో వెల్లడించాడు.

చదవండి: పాక్‌తో ఆడేది లేదు.. వాళ్ల‌కు మాత్రం మిన‌హాయింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement